Rapists Arrests :  సత్య సాయి జిల్లా రామగిరి మండలం ఏడు గుర్రాల పల్లిలో దళిత బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.   14 మంది అత్యాచారానికి పాల్పడినట్లు నలుగురు రాజీ పోవాలంటూ తనపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫోక్సో, ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేశారు.  ధర్మవరం డిఎస్పి , రామగిరి సీఐ ఆధ్వర్యంలో  పోలీసు బృందాలు ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ ప్రకటించారు.  మిగిలిన నిందితులను కూడా అతి త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.                        

మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న  గ్రామంలో మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి ఎటువంటి శిక్షలు అమలులో ఉన్నాయో అవగాహన కల్పిస్తామని ఎస్పీ ప్రకటించారు.  డయల్ 100, శక్తి యాప్ పై ప్రజల్లో అవగాహన పెంచుతామన్నారు. బాలిక ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు సహ విద్యార్థి కూడా లైంగిక దాడికి పాల్పడినట్లు తేలిందన్నారు. సామాజికంగా ఆర్థికంగా బాలిక కుటుంబం వెనుకబడి ఉండడం వల్ల నిందితులు ఆమెను భయభ్రాంతులకు గురి చేసినట్లు తెలుస్తోందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.  బాలిక కు చికిత్స అందించి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఆమె కుటుంబానికి పునరావాసం కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు.                 

దళిత బాలికను ప్రేమిస్తున్నానంటూ గ్రామానికి చెందిన అభిషేక్‌ అనే యువకుడు వెంటపడి ఆమెను నమ్మించాడు. అనంతరం అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తన స్నేహితులతో చెప్పాడు.  అభిషేక్‌కు సన్నిహితుడైన మరో యువకుడు బాలికపై అత్యాచారం చేయడమేకాక  మరో  స్నేహితుడితో సెల్‌ఫోన్‌లో వీడియో తీయించాడు. ఆ వీడియోను వాట్సాప్ లో షేర్ చేశాడు.   ఆ వీడియో చూపించి బెదిరిస్తూ కొన్ని నెలలుగా 13మంది అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం  వెలుగులోకి వచ్చింది. జరిగిన విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు  పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నారు.                          

కీచకుల   తరఫున కొంతమంది పెద్దమనుషుల అవతారం ఎత్తి పంచాయితీ చేశారు. కేసు నమోదు కాకుండా బాలికతోపాటు తల్లిదండ్రులను యువకులు, పెద్ద మనుషులు గురువారం దగ్గరలో ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లి  నిర్బంధించారన్న ఆరోపణలు ఉన్నాయి.  గ్రామంలో బాలిక కుటుంబం కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం వెళ్లింది. శుక్రవారం బాలిక కుటుంబ సభ్యులను గుర్తించారు. పోలీసులు తనిఖీలు నిర్వహించి ఏడుగురు యువకుల్ని పట్టుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.   పంచాయితీ నిర్వహించిన మరో ఇద్దరి వ్యక్తులపైనా కేసు నమోదు చేశారు.