Poison Experiment On Wife Family: తన నుంచి విడిపోయిన భార్యపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమె కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఇందుకోసం లండన్ నుంచి విష ప్రయోగానికి స్కెచ్ వేశాడు. ఇందుకు వాచ్‌మెన్ కుమారుడిని పావుగా వాడుకున్నాడు. కారప్పొడులు, మసాలా పొడుల్లో విషం కలిపి భార్య ఇంటికి డెలివరీ చేయించాడు. ఆ విషయం తెలియని భార్య కుటుంబం వాటిని తినగా ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు అనారోగ్యానికి గురయ్యారు. 


ఎన్ని మందులు వాడినా కోలుకోలేకపోతుండడంతో బాధిత కుటుంబం రక్త పరీక్షలు చేయించగా అసలు విషయం తెలిసింది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంచలన కేసు వివరాలను మియాపూర్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ వెల్లడించారు. మియాపూర్‌ గోకుల్‌ ఫ్లాట్స్‌లో నివాసముండే హన్మంతరావు, ఉమామహేశ్వరి కుమార్తె శిరీషకు 2018లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ అజిత్‌కుమార్‌తో పెళ్లైంది. ఇద్దరు ఉద్యోగరీత్యా లండన్‌లో స్థిరపడ్డారు. వారికి ఒక కుమార్తె ఉంది. కొంతకాలానికి ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో శిరీష లండన్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అయితే సోదరుడి వివాహానికి శిరీష తన కుమార్తెతో కలిసి లండన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చింది.


తనపై లండన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శిరీషపై కోపం పెంచుకున్న అజిత్‌కుమార్‌ పగతో రగిలిపోయాడు. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యులందరిని హతమార్చాలనుకన్నాడు. ఇందుకోసం లండన్‌లోనే తన వద్ద పనిచేసే వినోద్‌కుమార్‌ను ఒప్పించాడు. హైదరాబాద్‌లో ఉండే భవానీశంకర్‌, అశోక్‌, గోపినాథ్‌తోపాటు అజిత్‌ స్నేహితుడు పూర్ణేందర్‌రావులతో కలిసి పథకం రచించాడు. అత్తారింటిపై నిఘా పెట్టమని వారి వాచ్‌మన్‌ కుమారుడు రమేష్‌కు డబ్బు ఇచ్చాడు.


తొలుత శిరీష తల్లిదంద్రులను పాయిజన్ ఇంజెక్షన్లతో పంపాలని పథకం వేశారు. జూన్‌ 25న తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు విషపు ఇంజక్షన్లతో శిరీష తల్లిదండ్రుల ఇంటికి వెళ్లగా పథకం విఫలమైంది. దీంతో అప్‌సెట్ అయిన అజిత్ పథకాన్ని మార్చాడు. మసాలా పొడులు, పసుపు, కారం వంటి వాటిలో గుర్తుతెలియని విషాన్ని కలిపి శాంపిల్‌ ప్యాకెట్లుగా డెలివరీబాయ్‌ రూపంలో అందజేశారు. వాటిని వినియోగించడంతో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 


ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శిరీష తల్లి ఉమామహేశ్వరి జులై 5న మృతి చెందారు. ఆమె మరణానికి అనారోగ్యమే కారణమని అంతా భావించారు. అయితే శిరీష, ఆమె తండ్రి, సోదరుడు, మరదలు, బంధువైన మరో మహిళ కాళ్లు, చేతులు స్పర్శ కోల్పోయారు. ఎన్ని మందులు వాడినా కోలుకోకపోవడంతో అనుమానమొచ్చి రక్త నమునాలను పరీక్షకు పంపారు. అందులో విష నమూనాలు ఉన్నట్లు తేలింది. దీంతో శిరీష గురువారం మియాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


కేసును మాదాపూర్‌ జోన్‌ డీసీపీ సందీప్‌రావు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మియాపూర్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌, ఎస్సైలు వెంకటేష్‌, జగదీష్‌, కానిస్టేబుళ్లు విజయేందర్‌రెడ్డి, విఠల్‌లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అపార్ట్‌మెంట్‌ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వాచ్‌మన్‌ కుమారుడు రమేష్‌పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న శిరీష బంధువు పూర్ణేందర్‌రావు పేరు వెల్లడించాడు. 


అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. కుట్ర అమలుకు సహకరించిన ఆరుగురిని శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. లండన్‌లో ఉన్న ప్రధాన నిందితుడు అజిత్‌కుమార్‌ను సైతం అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.