BRS Politics: ఎన్నికల వేళ రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఎమ్మెల్యే సీటు కోసం ఆశావహులు పెద్ద ఎత్తునే ఉంటారు. సీటు తమకు వస్తుందంటే కాదు మాకే వస్తుందంటూ మరి కొందరు ధీమా వ్యక్తం చేస్తుంటారు. కొన్ని చోట్ల అసలు సిసలైన రాజకీయాలు జరుగుతాయి. అభ్యర్థుల ప్రకటన సమయం సమీపిస్తున్న తరుణంలో నేతలు తమ వ్యూహాలకు పదును పెడతారు. తమ ప్రత్యర్థుల బలహీనతలు, బలాలు తెలుసుకుంటూ ఉంటారు. బలహీనతలు ఆసరాగా చేసుకుని ట్రాప్ చేస్తారు. వలలో ఇరికించుకుంటారు.


మరి కొందరు సానుభూతి యత్నాలు చేస్తారు. ఇంకా కొందరు తాను చేసిన అభివృద్ధిని చెప్పుకుంటారు. కొందరు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఇతంతా పొలిటికల్ సర్కిల్‌లో జరిగే మమూలు  విషయాలు. అయితే అభ్యర్థులు మాత్రం తమ సీటు కోసం పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితితే తెలంగాణ బీఆర్‌ఎస్ పార్టీలో ఏర్పండింది. అధికార పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటనకు ఇంకా ఒక్కరోజే ఉంది. ఈలోగా టికెట్ల కుంపటి మండుతోంది. 


రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ టికెట్ ఆశావాహులు సీటు తమకే వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌లో టికెట్ల వార్‌ ముదిరింది. వైరాలో అది మరో టర్న్‌ తీసుకుని పతాక స్థాయికి చేరింది. సీటు తమకే వస్తుందంటూ ఆశావాహులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో సారి సీటు తనకే వస్తుందంటూ ఎమ్మెల్యే రాములు నాయక్‌ ధీమాగా ఉన్నారు. మాజీలు మదన్‌లాల్‌, బానోతు చంద్రావతిలు సైతం తమకే సీటు అని చెబుతున్నారు. అనుచరులతో ప్రచారం చేసుకుంటూ హల్‌ చల్‌ చేయించుకుంటున్నారు.


మాజీ ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో ప్రచారం


ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్‌, ఆయన వర్గీయులకు ఊహించని ఝలక్‌ తగిలింది. ఓ మహిళతో రాసలీలలు చేస్తున్నట్లు ఉన్న ఫోటోలు తెరపైకి వచ్చి వైరల్ అవుతూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు ప్రస్తుతం అక్కడి వాట్సాప్‌ గ్రూపుల్లో, సోషల్‌ మీడియా అకౌంట్‌లలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిని సొంత పార్టీలోని ఆశావాహులు, ప్రతి పక్ష పార్టీల నేతలు ప్రధానాస్త్రాలుగా మలుచుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తారా? అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు.


ఫొటోలు వైరల్ కావడంపై మదన్ లాల్ వర్గం ఘాటుగానే సమాధానమిస్తున్నారు. అవి మార్ఫింగ్‌ ఫొటోలు అని ఆరోపించారు. మదన్‌లాల్‌కే బీఆర్‌ఎస్‌ అధిష్టానం టికెట్‌ ఇవ్వనుందని, అది తట్టుకోలేకే ఎమ్మెల్యే రాములు నాయక్‌ వర్గమే ఈ పని చేయించిందని ఆరోపిస్తున్నారు. దీనిపై రాములు నాయక్‌ వర్గం స్పందిస్తూ ఒకరి ఫొటోలను వైరల్ చేయాల్సిన అవసరం తమకు లేదని చెబుతోంది. ఈ రాసలీలల ఫొటోల వ్యవహారంపై మదన్‌లాల్‌ నేరుగా స్పందించాల్సి ఉంది.


రేపు బీఆర్‌ఎస్ తొలి జాబితా


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను రెండు విడతల్లో విడుదల చేసేందుకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. 86 నియోజకవర్గాల్లో పోటీ చేసే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పేర్లపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. మంచిరోజు కావడంతో ఈ నెల 21న తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని ప్రగతిభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.


తొలి విడతలో 90 నుంచి 105 మంది పేర్లతో జాబితా వెలువడే అవకాశమున్నట్లు సమాచారం. కాగా 15%మంది సిట్టింగ్‌లకు టికెట్‌ లభించే అవకాశం లేదని నిర్ధారణ కావడంతో వీరిలో కొందరు అధినేతను కలిసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరికొందరు సిట్టింగ్‌లు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు తదితరులను కలిసి ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు.