Podili brother killed his own sister by insuring it for one crore twenty lakhs: తోడబుట్టిన చెల్లి కోసం జీవితాన్ని త్యాగం చేసే అన్నలు చాలా మంది ఉంటారు. కానీ తనకు అప్పనంగా డబ్బులు వచ్చేందుకు సొంత చెల్లిని అత్యంత కిరాతకంగా చంపేవాళ్లు మాత్రం అతి కొద్ది మంది ఉంటారు. వారిలో అశోక్ రెడ్డి అనేక రాక్షసుడు కూడా ఒకరు. ఇతను చెల్లి పేరుపై కోటి ఇరవై లక్షలకుపైగా ఇన్సూరెన్స్ చేయించి.. చంపేసాడు. ఆ ఇన్సూరెన్స్ డబ్బులతో సెటిలైపోవాలనుకున్నాడు. కానీ దొరికిపోయాడు.
ప్రకాశం జిల్లా పొదిలి మండలం కాటూరివారిపాలెంలో సంధ్యా అనే యువతి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదును ఆమె సోదరుడు అశోక్ రెడ్డి చేశాడు. పోలీసులు కూడా రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసుకున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరిస్తే.. ఎక్కడా రోడ్డు ప్రమాద ఆనవాళ్లు కనిపించలేదు. ఇదేదో తేడా కేసుగా ఉందని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు ప్రమాదమేనని .. అలా కేసు నమోదు చేసుకుని ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని అశోక్ రెడ్డి పదే పదే పోలీస్ స్టేషన్ కు తిరుగుతూండటంతో పోలీసులకు ఇంకా డౌట్ పెరిగిపోయింది. ఏదో ఉందని మెల్లగా ఆరా తీయడం ప్రారంభించారు. ఎక్కువ ఆరా తీయకుండానే అసలు విషయం తెలిసిపోయింది.
సంధ్యపై ఇటీవలే రూ.కోటి ఇరవై లక్షలకు టర్మ్ పాలసీని అశోక్ రెడ్డి తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడే ఏదో మతలబు ఉందని గుర్తించి వెంటనే విచారణ ప్రారంభించారు. చివరికి క్లూ దొరికింది. ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగలేదని.. అశోక్ రెడ్డినే చెల్లిని చంపి రోడ్డు ప్రమాదంగా చూపించి ఆ కోటి ఇరవై లక్షలు తీసుకుని సెటిలైపోవాలని అనుకున్నాడని తేలిపింది. పోలీసులు అశోక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో కోటింగ్ ఇచ్చే సరికి తన కోటి ఇరవై లక్షల కల గురించి చెప్పేశాడు. దాంతో పోలీసులు అరెస్టు చేసి.. లోపలికి పంపించారు.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చెల్లిని ఇంత ఘోరంగా చంపేసిన అశోక్ రెడ్డి వ్యవహారం కాటూరివారి పాలెంలోనే కాదు..ఏపీలోనే సంచలనంగా మారింది. ఆ చెల్లి .. తనను జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటాడని అనుకుంది. తనకు ఇన్సూరెన్స్ చేయిస్తే..అందరూ చేయించుకుటున్నారు కదా అనుకుంది. కానీ తన ప్రాణానికి కోటి ఇరవై లక్షలు విలువ కట్టాడని ఆ చెల్లి గుర్తించలేకపపోయింది. అమాయకంగా అన్నను నమ్మి ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి కొడుకును కన్నందుకు.. ఆ తల్లిదండ్రులు కడుపకోతకు గురవుతున్నారు. కన్న కొడుకే కన్న కూతుర్ని చంపడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read: Meerpet Murder Case: భార్యను గురుమూర్తి ఎంత కిరాతకంగా చంపాడో చెప్పిన సీపీ సుధీర్ బాబు - ఇంత ఘోరమా ?