- ములుగు ఏజన్సీలో హై అలెర్ట్, స్టాప్ నక్సలిజం - సేవ్ ఆదివాసి నినాదాలు
- వెంకటాపురం మండలంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన వాల్ పోస్టర్లు
- కాలం చెల్లిన మావోయిస్టు సిద్ధాంతంతో రాద్ధాంతమా!
- మతితప్పి గతి తప్పిన మావోయిస్టులను తరిమికొడదాం!
- ప్రజలు నమ్మరు మీ బూటకపు ప్రచారం, ఇవి కావు నేటి యువతకి గమ్యం
- అంటూ మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు


వరంగల్ : డిసెంబర్ 2వ తేదీ నుంచి 8 వరకు జరిగే పీఎల్‌జీఏ వారోత్సవాల సమయంలో ములుగు ఏజెన్సీలో హై అలెర్ట్ కొనసాగుతోంది. వెంకటాపురం మండలంలోని పలు గ్రామాల్లో, ప్రధాన కూడళ్లలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు కనిపించాయి. ‘‘ప్రజల మద్దతు లేకుండా ప్రజలపైనే ప్రజాయుద్ధమా.. కాలం చెల్లిన మావోయిస్టు సిద్ధాంతంతో రాద్ధాంతమా... మతితప్పి గతి తప్పిన మావోయిస్టులను తరిమికొడదాం. ఆదివాసుల అభివృద్ధికి అడుగు వేద్దాం... స్టాప్ నక్సల్స్ సేవ్ ఆదివాసి’’ అంటూ అతికించిన వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. దీంతో మావోయిస్టులు చేస్తున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలను పోస్టర్లలో వెల్లడించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు పీఎన్‌జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని ఇప్పటికే మావోయిస్టుల పోస్టర్లు ఏజెన్సీ ప్రాంతంలో దర్శనమిస్తున్నాయి.


ఆరుగురు మిలీషియా సభ్యుల అరెస్ట్
తెలంగాణలో డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు జరుగు పి ఎల్ జి ఏ వారోత్సవాల సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేస్తున్న మిలీషియా సభ్యులు ఆరుగురుని అరెస్టు చేశారు ములుగు జిల్లా వెంకటాపురం పోలీసులు. వారి వద్ద కరపత్రాలు స్వాధీనం చేసుకుని విచారణ జరిపిన పోలీసులు ఆ ఆరుగురిని కోర్టుకు తరలించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏఎస్పీ కార్యాలయంలో మిలీషియా సభ్యుల అరెస్టుకు సంబంధించిన వివరాలు ఏఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. వెంకటాపురం పోలీసులు, సీఆర్పిఎఫ్ సిబ్బంది ముత్తారం సీతాపురం క్రాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఆరుగురు అనుమానాస్పదంగా తరసపడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వీరు సిపిఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ ఇంచార్జ్ సుధాకర్ వద్ద 2018 నుండి పనిచేస్తున్నట్లు తెలిపారు.


వీళ్లు మావోయిస్టుల కొరియర్ లు- పోలీసులు
డిసెంబర్  తొలి వారంలో పి ఎల్ జి ఏ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని అగ్ర నాయకుల ఆదేశాల మేరకు వారోత్సవాల కరపత్రాలను ఆయా గ్రామాలలో రోడ్లపై వేయాలని సూచించగా.. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పట్టుబడినట్లు ఎస్పీ తెలిపారు. వీరిపై గతంలో పలు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం పై కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. పట్టుబడిన ఆరుగురు మిలీషియా సభ్యుల వద్ద కరపత్రాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.


మళ్లీ మావోయిస్టుల కదలికలు.. 
Maoists in Telangana: ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతానికే పరిమితమైన మావోయిస్టులు ఇటీవల కాలంలో జరిగిన పలు సంఘటనలతో కలకలం సృష్టిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్న వెంకటాపురంలో కాల్పుల సంఘటన మరువక ముందే చర్ల మండలంలో ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఉప సర్పంచ్‌ను మట్టుబెట్టి పోలీసులకు సవాల్‌ విసిరారు. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుండటం, మావోయిస్టు సానుభూతి పరులను గుర్తించి వారిని తిరిగి జన జీవన స్రవంతిలో కలిసేలా చేస్తుండటంతో ఇప్పటి వరకు మావోలు కదలికలు తగ్గుముఖం పట్టాయని అంతా బావించారు.


తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంతోపాటు ఛత్తీస్‌గఢ్ సరిహద్దుగా ఉన్న చర్ల, వెంకటాపురం మండలాల్లో తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కొత్తగా రిక్రూట్‌మెంట్‌ చేసుకునే పనిలో భాగంగా అడవిలో ఉన్న గ్రామాలపై దృష్టి సారించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే భద్రాద్రి జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించిన చర్ల మండలంలోనే... ఇన్‌ ఫార్మర్‌ అన్న నెపంతో ఓ ఉప సర్పంచ్‌ను హత్య చేయడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.