Fight For Mutton Curry In Nizamabad District: పెళ్లిలో మాంసాహారం కోసం గొడవలు పడడం మన చూశాం. మటన్ సరిగా వేయట్లేదని.. చికెన్ అడిగినంత పెట్టడం లేదని కొందరు ఘర్షణ పడి కేసుల వరకూ వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా, అలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో (Nizamabad District) జరిగింది. పెళ్లి విందులో మాంసాహారం కోసం వరుడు, వధువు తరఫు బంధువులు గొడవ పడగా.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాలపై కేసులు సైతం నమోదయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన యువతికి నందిపేట మండలానికి చెందిన ఓ యువకునికి పెళ్లి నిశ్చయమైంది. బుధవారం ఓ ఫంక్షన్ హాల్‌లో వివాహం జరుగుతుండగా విందు సమయంలో వివాదం రేగింది.
వరుడి తరఫు నుంచి వచ్చిన కొందరు యువకులకు వధువు తరఫు వారు విందులో మటన్ వడ్డించారు. అయితే, తమకు ముక్కలు తక్కువ వేశారంటూ వడ్డించే వారితో ఆ యువకులు వాగ్వాదానికి దిగారు. దీనిపై వధువు తరఫు వారు ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. వివాదం ముదిరి ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లు, గరిటెలతో దాడి చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతింపచేశారు. ఈ ఘటనలో 8 మంది గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలకు చెందిన 19 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.