Tirupati Crime News :  ఆమె ఎమ్మార్వో. నెల జీతం తీసుకుంటారు.  కానీ డ్యూటీకి వస్తే వచ్చేటప్పుడు ఖాళీ బ్యాగ్‌తో ఆఫీసుకు వస్తారు. వెళ్లేటప్పుడు దాన్నిండా సంతృప్తికరంగా నగదు ఉంటే తప్ప..ఇంటికి వెల్లరు. ఆమె బాధలు పడలేక ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు పోయాయి. అయినా వెనక్కి తగ్గడం లేదు. చివరికి.. ఓ రైతు ఈ లంచావతారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడీ ఎమ్మార్వో ఫేమస్ అయిపోయింది. 


భూమి ఆన్‌లైన్ చేయాలంటే రూ. ఐదు వేలు ఇవ్వాల్సిందేనన్న తహశీల్దార్ 


చిత్తూరు జిల్లా, పెనుమూరు మండలం తాహసిల్దార్ రమణి. ఆమె ఏ పని కోసం ఎవరు వచ్చినా లంచం తీసుకోనిదే పని చేయదు. తన భూమిని ఆన్లైన్ చేసుకునేందుకు పెనుమూరు మండలంకు చేందిన ఓ రైతు తాహసిల్దార్ కార్యాలయంకు వచ్చారు. నిబంధనల ప్రకారం అప్లయ్ చేసుకున్నారు. అన్నీ కరెక్ట్‌గా ఉన్నా.. ఆన్లైన్ చేసేందుకు కొంత సమయం పడుతుందని చెప్పిన కార్యాలయం సిబ్బంది చెప్పులు అరిగేలా రైతును కార్యాలయం చుట్టు తిప్పుకున్నారు.  తన పని ఎంత వరకూ వచ్చిందని, ప్రశ్నించిన రైతును తహసీల్దారు వద్దకు పంపారు. అప్పటికే విషయం అంతా తెలుసుకున్న తాహసిల్దార్ రమణీ భూమిని ఆన్లైన్ చేసేందుకు కొంత మొత్తంలో అంటే అక్షరాల ఐదు వేల రూపాయలు లంఛంగా ఇవ్వాలని రైతును డిమాండ్ చేసింది. అయితే అంత మొత్తంలో నగదు తన దగ్గర‌ లేదని రైతు తాహసిల్దార్ ని వేడుకున్నా, ఏమాత్రం కనికరించని తాహసిల్దార్, ఖచ్చితంగా ఐదు వేల రూపాయలు ఇస్తే గానీ పని పూర్తి కాదని తేల్చేసింది.


రూ. వెయ్యే తెచ్చారని రైతుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తహశీల్దార్ 


రమణి రూ. ఐదు వేలు అడిగినా.. తన వద్ద ఉన్న రూ. వెయ్యితీసుకుని రైతు ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లాడు.  అయితే రైతు ఇచ్చిన నగదు చూసి ఆ తాహసిల్దార్ మండిపడింది.  మాట్లాడింది.. "యో నువ్వు ఆరోజు ఏం చెప్పినావయ్యా, 5000 ఇస్తానని పొయ్యి,.. వెయ్యి రూపాయలు తెచ్చి ఇస్తావా,  తెచ్చిన దానిని దగ్గర ఇచ్చేసి చేసుకొని పో" అంటూ ప్రక్కనే ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ కు ఆ పనిని పురమాయించింది.. కార్యాలయం వద్దకు వచ్చే ప్రజలను నగదు రూపంలో రక్తం పీల్చేస్తున్న తాహసిల్దార్ బాగోతంను రైతు సెల్‌ఫోన్ లో రికార్డు చేసి స్వయంగా సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. 


తహశీల్దార్‌పై ఎన్నో ఆరోపణలు ఉన్నా ప్రజాప్రతినిధుల అండతో మళ్లీ మళ్లీ పోస్టింగ్స్ 


పెనుమూరు మండలం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నియోజకవర్గం పరిధిలోకివస్తుంది.  తాహసిల్దార్ రమణీ అవినీతి  బాగోతం ఇదే మొదటి సారి కాదు.  ప్రస్తుతం పెనుమూరు మండల కేంద్రంలో తాహసిల్దార్ గా విధులు నిర్వర్తిస్తున్న రమణీ గతంలో గంగవరంలో జాతీయ రహదారి భూములకు రికార్డులు మార్చి కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలపై సస్పెండ్ కు గురి అయ్యారు.. అటు తరువాత ప్రస్తుతం పెనుమూరు తాహసిల్దార్ గా ఉన్న రమణి ప్రస్తుతం స్థానికంగా ఉన్న బాధితులను సైతం నగదు కోసం వేధిస్తూ వారిని మరింత మనోవేదనకు గురి చేస్తున్నారు.. గతంలో ఇదే తాహసిల్దార్ కార్యాలయంలో  ఒక రైతు   కార్యాలయంలోని మృతి చెందిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.  అయితే రైతుల పట్ల రమణీ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మాతున్న అధికారులు,‌ప్రజా ప్రతినిధులు ఆమె విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.