పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఓ ఘరానా చిట్టీల మోసం వెలుగు చూసింది. కొద్దిరోజుల కిందటే విజయనగరం జిల్లా గుర్లలో పప్పుల చిట్టీ ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. బాధితులు నేటికీ పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ తరహా ఘటనలు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది.


పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఓ చిట్టీల వ్యాపారి కోట్లాది రూపాయలకు టోకరా వేసి పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. మండవిల్లి సోమశేఖర్‌  అనే వ్యక్తి నమ్మకంగా ఉంటూ పట్టణానికి చెందిన అనేకమంది పేద, మధ్యతరగతి ప్రజలతో కొన్నాళ్లుగా చిట్టీ కట్టిస్తున్నాడు. పిల్లల పెళ్లి, చదువు కోసమని అనేక మంది ఈయన దగ్గర చిట్టీలు వేశారు. కుటుంబ పోషణ ఖర్చులు పోగా మిగిలిన డబ్బును నెలనెలా చిట్టీ కడితే ఆ డబ్బు అవసరాలకు పనికొస్తుందని చాలామంది భావించారు. వీరిలో కూలీలు, కార్మికులు, చిరువ్యాపారులు ఉన్నారు. మొదట్లో కొన్నాళ్లపాటు డబ్బులు సక్రమంగానే చెల్లించడంతో చాలా మందికి నమ్మకం కలిగింది. ఈ క్రమంలో కొద్దిరోజుల నుంచి ఆయన కనిపించడం లేదు. సుమారు రూ.4 కోట్లతో ఆయన ఉడాయించినట్లు బాధితులంతా సోమవారం సాలూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సీఐ శ్రీనివాసరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సదరు వ్యాపారి పూర్తి ఐపీ పెట్టినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. దీనిపై విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.


ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పప్పుల చిట్టీ బాధితులు
ఇటీవల విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ముగ్గురు వ్యక్తులు పప్పుల చిట్టీ పేరిట రూ.కోట్లాది రూపాయలు స్వాహా చేసిన విషయం విదితమే. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేల మంది బాధితులు ఉన్నారు. ఇప్పటికీ బాధితులు, ఏజెంట్లు అధికారులు, పోలీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తమ డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇదే తరహాలో సాలూరులో చిట్టీల పేరిట ఘరానా మోసం జరుగుతుండటంపై అటు పోలీసులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనధికార చిట్టీలు కట్టవద్దని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ పేద, మధ్యతరగతి ప్రజలు వీటి వలలో పడి మోసపోతున్నారు. తరచూ ఇటువంటి ఘటనలు వెలుగుచూస్తున్నా వారిలో మార్పు రావడం లేదని పోలీసులు చెబుతున్నారు.


నెల్లూరులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సోమవారం తెల్లవారుజామున ఓ ఇంట్లోకి చొరబడి, తండ్రీ కూతుళ్ల చేతులు కట్టేసి దొంగతనానికి పాల్పడ్డారు. బంగారం, నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన నెల్లూరులో సంచలనం అయింది. నెల్లూరు నగరంలో సోమవారం తెల్లవారు జామున దొంగలు హల్ చల్ చేశారు. నెల్లూరు సిటీలో ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు... నిద్రపోతున్న తండ్రీ కూతుళ్ల చేతులు కట్టేసి, వారిని బెదిరించి నగలు, నగదు దోచుకెళ్లారు. పదిన్నర సవర్ల నగలు, 50 వేల రూపాయల నగదు దోచుకెళ్లారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చోరీపే కేసు నమోదు చేసిన పోలీసులు... సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 


"నలుగురు ముసుగుల్లో వచ్చి చోరీ చేశారని బాధితులు చెబుతున్నారు. క్లూస్ టీం, డాగ్స్ స్క్వాడ్ కూడా వచ్చింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. సీసీకెమెరాలు ఉన్నాయని కానీ పనిచేయడంలేదు. వాటిని కూడా పరిశీలిస్తున్నాం. బాధితులను నిర్బంధించి దొంగతనం చేశారు. ఎస్పీ ఆదేశాలతో కేసు విచారణ చేపట్టాం. త్వరలోని నిందితులను పట్టుకుంటాం" - పోలీసులు