Parents Killed Their Daughter In Siricilla: తమ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. మానసిక స్థితి సరిగా లేని ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కూతురి ఆరోగ్యం కుదుటపడాలని ఆస్పత్రులు, దేవాలయాల చుట్టూ తిరిగారు. అయినా, వారి ఆశ నెరవేరలేదు. చివరకు విసిగిపోయి తమ బిడ్డను వారే నూలు దారం గొంతుకు బిగించి హతమార్చారు. 13 నెలల మనవడికి కన్నతల్లిని దూరం చేశారు. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెల్ల గ్రామానికి చెందిన చెప్యాల నర్సయ్య - ఎల్లవ్వ దంపతుల పెద్ద కుమార్తె ప్రియాంక (25) గత ఏడేళ్లుగా మానసిక వ్యాధితో బాధ పడుతోంది. ఆమెకు నయం కావడానికి ఆస్పత్రులు, దేవాలయాలకు తీసుకెళ్తూ చాలా డబ్బులు ఖర్చు చేశారు. కొంతవరకూ వ్యాధి నయం కాగా.. 2020లో సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని దర్గాపల్లికి చెందిన పృథ్వీతో పెళ్లి చేశారు. ఈ దంపతులు కరీంనగర్ లోని సప్తగిరి కాలనీలో  నివాసం ఉంటుండగా వీరికి 13 నెలల కుమారుడు ఉన్నాడు.


చేతబడి జరిగిందని..


అయితే, గత నెల రోజులుగా ప్రియాంక ముందులాగే మానసిక వ్యాధితో బాధ పడుతూ అందరినీ ఇబ్బంది పెడుతోంది. చుట్టుపక్కల వారిని దూషించడం, గొడవలు పెట్టుకోగా.. భర్త ఆమె తల్లిదండ్రులకు విషయం తెలిపాడు. వారు బుగ్గరాజేశ్వర స్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ 3 రోజులు ఉంచారు. ఇంకా నయం కాకపోవడంతో పాటు కూతురి ప్రవర్తన చూసి తల్లిదండ్రులు విసిగిపోయారు. తిరిగి నేరెల్లకు తీసుకొచ్చి ఈ నెల 14న రాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నూలు దారం గొంతుకు బిగించి హతమార్చారు. తర్వాత రోజు అత్తవారి గ్రామమైన దర్గాపల్లికి తీసుకెళ్లి చేతబడి వల్ల మరణించిందని చెప్ప నమ్మించి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, దీనిపై గ్రామస్థులకు అనుమానం రావడంతో డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా తల్లిదండ్రులే హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు నుంచి ఫిర్యాదు తీసుకుని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.


తాగునీటి కోసం మామ హత్య


అటు, తాగునీటి కోసం మామనే హత్య చేసింది ఓ కోడలు. ఈ ఘటన హన్మకొండ (Hanmakonda) జిల్లాలో జరిగింది. హనుమకొండ - హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన జల్లి సారయ్య (80) కుమారులు ఇద్దరు చనిపోవడంతో తన భార్యతో కలిసి పెద్దకోడలు రమాదేవి ఒకే ఇంట్లోని వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. అయితే, వీరి ఇంటికి ఒకటే నల్లా కనెక్షన్ ఉండడంతో నీళ్లు వచ్చినప్పుడల్లా గొడవలు జరిగేవి. ఆదివారం కూడా నల్లా విషయంలో ఘర్షణ జరగ్గా.. పెద్దకోడలు రమాదేవి తన ఇద్దరు కొడుకులతో కలిసి సారయ్యపై దాడి చేయగా.. తీవ్రంగా గాయపడి స్పాట్ లోనే మృతి చెందాడు.


Also Read: MP Rammohan Naidu: భయపడొద్దు, అండగా ఉంటాం, అన్నీ చూసుకుంటాం: టీడీపీ ఎంపీ భరోసా