Hyderabad Police Solved Auto Driver Murder Case: ఏడాది క్రితం ఓ ఆటో డ్రైవర్ అదృశ్యం కాగా.. ఆ కేసును తాజాగా తెలంగాణ పోలీసులు ఛేదించారు. తమ కుమార్తెను కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించాడనే అనుమానంతో బాలిక తల్లిదండ్రులే హనీ ట్రాప్‌తో ఈ దారుణానికి పాల్పడ్డారని గుర్తించారు. నిందితులను బోరబండ పోలీసులు (Borabanda Police) అరెస్ట్ చేశారు. సినిమా స్టోరీని తలదన్నేలా ఆ రియల్ స్టోరీ భాగ్యనగరంలో జరిగింది. 2023 మార్చిలో ఆటోడ్రైవర్ అదృశ్యం కాగా.. బంధువులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు తాజాగా నిందితులను పట్టుకున్నారు.
ఇదీ జరిగింది..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని (Hyderabad) నిజాంపేట్‌కు చెందిన కుమార్ (30) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన ఓ కారు డ్రైవర్.. తన భార్య, కుమార్తెతో కలిసి జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నాడు. ఏడో తరగతి చదువుతున్న కారు డ్రైవర్ కుమార్తెను గతేడాది ఆటో డ్రైవర్ తీసుకెళ్లి యూసుఫ్‌గూడలోని ఓ గదిలో నిర్బంధించాడు. లైంగిక దాడికి యత్నించగా ఆమె తప్పించుకుని పారిపోయింది. చివరకు బాలానగర్ పోలీసులకు కనిపించగా.. ఆమెను విచారిస్తే అనాథనని చెప్పింది. దీంతో వారు ప్రత్యేక శిబిరానికి తరలించారు.
అటు, బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతకులాట ప్రారంభించారు. అయినా, ఫలితం లేకపోవడంతో కరోనా టైంలో ఆన్‌లైన్ తరగతుల కోసం కొనుగోలు చేసిన ఆమె లాప్‌టాప్‌ను పరిశీలించారు. స్నాప్‌చాట్‌లో ఓ ఫోన్ నెంబరును గుర్తించగా అది కుమార్‌దని తేలింది. దీంతో కుమారే తమ కుమార్తెను కిడ్నాప్ చేశాడని వారు అనుమానించారు.
హనీట్రాప్‌తో..
ఈ క్రమంలో బాలిక తల్లి స్నాప్‌చాట్‌లో ఓ ఐడి క్రియేట్ చేసి.. హనీట్రాప్‌తో ఆటో డ్రైవర్‌ను మియాపూర్ రప్పించింది. అక్కడకు వచ్చిన కుమార్‌పై దాడి చేసిన బాలిక పేరెంట్స్ అతన్ని కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తమ కుమార్తె ఆచూకీ చెప్పాలని నిలదీశారు. అయితే, బాలిక తన నుంచి తప్పించుకుపోయిందని చెప్పాడు. దీంతో అతన్ని తీవ్రంగా గాయపరచగా దెబ్బలకు తాళలేక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అనంతరం నిందితులిద్దరూ కారులో అతడిని సూర్యాపేట వైపు తీసుకెళ్లి పెద్ద బండరాయిని కాళ్లు, చేతులకు కట్టిపడేసి బతికుండగానే నాగార్జున సాగర్ ఎడమ కాల్వలోకి తోసేశారు. దీంతో కుమార్ మృతి చెందాడు.
బంధువుల ఫిర్యాదుతో..
ఈ క్రమంలో కుమార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బోరబండ పీఎస్‌లో అదృశ్యం కేసు నమోదైంది. అనంతరం కారు డ్రైవర్ కుమార్తె తల్లిదండ్రుల వద్దకు చేరింది. అటు, కుమార్ ఆటోను కారు డ్రైవర్ వాడుతుండగా.. అతని బంధువులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు గుర్తు తెలియని మృతదేహం ఎముకలను డీఎన్ఏ పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. అసలు విషయం గుర్తించి బాలిక తల్లిదండ్రులనే నిందితులుగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.