Earthquake In Prakasam District: ఒంగోలు: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. జిల్లాలోని ముండ్లమూరు మండలంలో రెండు, మూడు సెకన్లపాటు భూమి కంపించింది. సింగన్నపాలెంట, ముండ్లమూరు, మారెళ్లలో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. శనివారం ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో పలుచోట్ల మూడు సెకన్ల పాటు భూమి కంపించగా, వరుసగా రెండో రోజు ఆదివారం సైతం ప్రకాశం జిల్లాల్లో భూ ప్రకంపనలు రావడం కలకలం రేపుతోంది.
శనివారం ఏపీలో భూకంపం
ఏపీలోని ప్రకాశం జిల్లాతో పాటు బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల శనివారం భూమి కంపించింది. ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు రావడంతో వేంపాడు, గంగవరం, తాళ్లూరు, రామభద్రాపురం, పోలవరం, శంకరాపురం, పసుపుగుల్లు, సింగన్నపాలెం, ముండ్లమూరు, మారెళ్లలో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయడం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై దాదాపు 5 తీవ్రతతో భూకంపం రావడంతో ఆ ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
భూకంపాలకు ఏం సంబంధం లేదన్నట్లుగా ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో ఇప్పటికే పలుమార్లు భూమి కంపించింది. కొన్ని సెకన్లపాటు భూ ప్రకంపనలు వస్తున్నాయి. దాంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ 4న తెలంగాణలో ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ సహా పలు జిల్లాల్లో కొన్ని సెకన్లపాటు భూకంపం వచ్చింది. ఆ భూకంప కేంద్రం ములుగు జిల్లాలో గుర్తించారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉదయం వేళ వచ్చిన ఆ భూకంపం సమయంలో కొన్నిచోట్ల ఇంట్లో సామాన్లు కింద పడిపోయాయి. కొందరు నిద్ర మత్తులో ఉన్నా కంగారు పడి ఇంట్లో నుంచి బయటకు పరుగులు పెట్టారని తెలిసిందే.
తెలంగాణలో మహబూబ్‌నగర్ జిల్లాలో డిసెంబర్ 7న మధ్యాహ్నం స్వల్ప స్థాయిలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3గా నమోదైంది. కౌకుంట్ల మండలం దాసరపల్లె కేంద్రంగా కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. దీని ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతం, జూరాల ప్రాజెక్టు ఎగువ, దిగువ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి.
Also Read: Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం