Palnadu Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. రొంపిచర్ల మండలం సంతగుడిపాడు వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు వద్ద ముగ్గురు వ్యక్తులు రోడ్డు పక్కన నిల్చుని టీ తాగుతున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వాహనం అతివేగంగా దూసుకొచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టీ వ్యాపారి సంతగుడిపాడు కు చెందిన నామాల రాజశేఖరరెడ్డి (22), లారీ క్లినర్ బిల్లా కోటేశ్వరరావు (46) లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తి లారీ డ్రైవర్ కొల్లబత్తుల రాజేష్ అని గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ లారీ డ్రైవర్ రాజేష్‌ను చికిత్స నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. టీ త్రాగేందుకు రోడ్డుపై లారీ నిలిపి శుభ్రం చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. లారీడ్రైవర్, క్లినర్ లు ఒంగోలు జిల్లా తూర్పు నాయుడు పాలెం వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి రొంపిచర్ల పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేపట్టారు.