Palamuru Accident:  కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రేగుమాన్ గడ్డ వద్ద జరుగుతున్న రంగారెడ్డి ప్యాకేజీ-1 నిర్మాణ పనుల్లో పంప్ హౌస్ లోకి క్రేన్ దింపుతుండగా... ఒక్క సారిగా తీగలు తెగిపోయాయి. ఈ ఘటనలో ఐదురుగు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసుకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇంకా ఎవరైనా గాయపడ్డారా అనే విషయం తెలియాల్సి ఉంది.


చిపోయిన వారంతా బిహార్ కూలీలే..!


ప్రమాదంలో మరణించిన వారంతా బిహార్ కు చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందారన్న సమాచారాన్ని పోలీసులు గానీ, నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు గానీ ఇంత వరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే ఒకేసారి ఐదుగురు కూలీలు మృతి చెందడం స్థానికంగా సంచలనం రేపుతోంది. మృతుల కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న మృతుల కుటుంబీకులు..


తినేందుకు తిండి దొరక్క రాష్ట్రం కాని రాష్ట్రానికి వలస వచ్చామని... కానీ ఇప్పుడు జరిగిన ప్రమాదం కారణంగా తమ వాళ్లు  ప్రాణాలు పోగొట్టుకుని... తమను దిక్కులేని వాళ్లని చేశారంటూ విలపిస్తున్నారు. వారి ఏడుపు చూస్తున్న ప్రతీ ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. వేకువ జామునే పనుల కోసం వెళ్లిన కూలీలు ఇలా కానరాని లోకాలకు వెళ్లడాన్ని తట్టుకోలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రబుత్వమే తమకు సాయం చేయాలని కోరుతున్నారు. స్థానికులు కూడా మృతుల కుటుంబాలకు సర్కారే ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 


రాత్రి జరిగినా అందుకే చెప్పలేరంటున్న పలువురు స్థానికులు..


ప్యాకేజీ వన్ పనుల్లో భాగంగా మొత్తం 1200 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వారంతా ఝార్ఖండ్, బిహార్ తదితర రాష్ట్రాలకు చెందిన వారని అంటున్నారు. రాత్రి సమయంలో కాంక్రీట్ పనులు చేస్తుండగా... క్రేన్ సహాయంతో మిల్లర్ ను కిందకు దిండుతుండగా రూప్ తెగిపోయి ప్రమాదం జరిగిందని... దీంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందినట్లు పలువురు చెబుతున్నారు. అయితే ప్రమాదం రాత్రి పదిన్నర గంటల సమయంలోనే జరిగినప్పటికీ... విషయం బయటకు పొక్కకుండా, అల్లర్లు జరగకుండా ఉండేందుకు ఎరికీ చెప్పలేదంటున్నారు.
 అయితే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొంటున్నారు. నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి కాకుండా హైదరాబాద్ ఉస్మానియాకు తరలించడానికి కారణం కూడా అదేని చెబుతున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉందో ఎవరికీ తెలియదు.