Solapur Crime News:  మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మధా తాలూకాలోని టెంభుర్ణిలో ఓ హోటల్ మేనేజర్ ను బట్టలూడదీయడంతో పాటు ఆపై ఓనర్ చేసిన దౌర్జన్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీడియాలో సైతం ఈ విషయం రావడంతో చివరికి హోటల్ ఓనర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

Continues below advertisement


సిబ్బందిని బెదిరించేందుకు ఇంత దారుణమా..


సోలాపూర్- పూణే జాతీయ రహదారిపై ఉన్న టెంభుర్ణిలోని హోటల్ 7777 లో ఈ ఘటన జరిగింది. ఈ హోటల్‌లో పనిచేస్తున్న మేనేజర్‌ను హోటల్ యజమాని లఖన్ మానే, ఇతర సిబ్బంది సమక్షంలో నగ్నంగా చేసి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏబీపీ మాఝా సైతం ఈ దారుణ ఘటనను రిపోర్ట్ చేసింది. ఆ తర్వాత, హోటల్ యజమాని లఖన్ మానే, ఈ మేనేజర్‌ను తనతో పాటు తీసుకుని ఫేస్‌బుక్ ద్వారా వివరణ ఇచ్చాడు. మేనేజర్ తప్పు చేయడం వల్లే  కొట్టామని, వీడియో తప్పుగా వైరల్ అయిందన్నాడు. 


బాధితుడు అయిన మేనేజర్ నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకుని వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చారు. మేనేజర్ ఉద్యోగం మానేసి వెళ్లకూడదనే ఉద్దేశంతో హోటల్ యజమాని లఖన్ మానే బెదిరించి, మేనేజర్‌ను నగ్నంగా చేసి కొట్టడమే కాక, అతని వద్ద ఉన్న డబ్బులు కూడా తీసుకున్నాడని టెంభుర్ణి పోలీసు ఇన్‌స్పెక్టర్ నారాయణ్ పవార్ తెలిపారు.






మూడు నెలల కిందట ఘటన
ఈ సంఘటన మూడు నెలల కిందట జరిగిందని బాధితుడు నకాటే పోలీసులకు తెలిపాడు. లఖన్ మానే భయపెట్టడంతో ఇప్పటికీ అదే హోటల్‌లో పనిచేస్తున్నాడని, పోలీసులకు తన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడని నారాయణ్ పవార్ చెప్పారు. ఏబీపీ మాఝా వార్త ప్రచురించిన తరువాత, పోలీసులు హోటల్ నుండి నిందితుడు లఖన్ మానేను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడైన హోటర్ ఓనర్ పై దాదాపు ఎనిమిది వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భయభ్రాంతులకు గురిచేయడం, హత్యాయత్నం వంటి వివిధ సెక్షన్లు ఉన్నాయి. సిబ్బందిలో భయాన్ని తీసుకురావాలని ఈ పనిచేశాడని, నిందితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఇన్‌స్పెక్టర్ నారాయణ్ పవార్ హామీ ఇచ్చారు.


ఉద్యోగులతో మంచిగా ప్రవర్తించాలి కానీ వారి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించిన హోటల్ మేనేజర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఓ వ్యక్తిని, అందులోనూ హోటల్ లో మేనేజర్‌గా మంచి పొజిషన్‌లో ఉన్న అతడ్ని బట్టలూడదీసి కొట్టడం దారుణం అన్నారు. పైస్థాయి ఉద్యోగులకే ఇలాంటి పరిస్థితి తలెత్తితే ఇక కింది స్థాయి ఉద్యోగులను ఆ హోటల్ ఓనర్ ఇంకెంత దారుణంగా చూస్తాడో, వారికి ఎంత టార్చర్ చూపిస్తాడో అని కామెంట్ చేస్తున్నారు.