సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న విజయవాడకు చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్‌లో అందమైన అమ్మాయిల ఫొటోలు వచ్చాయి. వాళ్లు కావాలంటే ఈ నెంబర్‌కు ఫోన్ చేయమని మెసేజ్ కూడా ఉంది. వాటిని చూసి టెంప్ట్ అయిన సదరు వ్యక్తి తనకు వచ్చిన నెంబర్‌కు ఫోన్ చేశాడు. అంతే అమ్మాయిలు పంపించేందుకు డీల్ కుదిరింది. డబ్బులు పంపించిన సాయంత్రానికే అమ్మాయిలు వచ్చేస్తారని అవతలి వ్యక్తి కలరింగ్ ఇచ్చాడు.
డబ్బులను ఆన్‌లైన్‌లో పంపించాలని అవతలి వ్యక్తి ఫోన్ చేశాడు. గూగుల్ పే, ఫోన్ పే లాంటి వంటి లేవని బాధితుడు చెప్పాడు. డెబిట్ కార్డు వివరాలు పంపిస్తే కావాల్సిన అమౌంట్ తీసుకుంటామని చెప్పాడు సైబర్ నేరగాడు. దీన్ని పూర్తిగా నమ్మేసిన బాధితుడు వివరాలు పంపేశాడు. అక్కడే కథ అడ్డం తిరిగింది.
రాజస్థాన్‌కు చెందిన జీవన్ కుమార్ ఈజీ మనీకి అలవాటు పడి ఆన్‌లైన్‌లో మోసాలకు అలవాటు పడ్డాడు. అందమైన అమ్మాయిల ఫొటోలను ఆన్‌లైన్ తీసుకొని వాటి ద్వారా వ్యాపారం మొదలు పెట్టాడు. వాట్సాప్ నెంబర్లు తీసుకొని వాళ్లకు ఎరవేయడం వచ్చిన రియాక్షన్ బట్టి ప్లాన్ వర్కౌట్ చేస్తాడు. మంచి పార్టీ దొరికిందంటే చాలు ఫుల్‌గా దోచుకొని నెంబర్ మార్చేస్తాడు.
ఇలానే జీవన్‌కుమార్‌కు విజయవాడ వాసి చిక్కాడు. అమ్మాయిల పేరుతో వల వేసి విజయవాడ వాసి నుంచి డెబిట్ కార్డు వివరాలు తీసుకున్నాడు. అంతే ఫుల్ వాడేసుకున్నాడు. ఎటీఎం కార్డును హ్యక్ చేసి మూడు దఫాలుగా 2,45,000 రూపాయలు డ్రా చేసుకున్నాడు. ఇంత డబ్బులు పోయేసరికి బాధితుడు కంగుతున్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న చిల్లకల్లు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. జగ్గయ్యపేట సీఐ నాగేశ్వరరెడ్డి, చిల్లకల్లు ఎస్.ఐ చిన్నబాబు నేతృత్వంలో రెండు బృందాలు గాలించాయి. ఫిర్యాదుదారుడుతో గతంలో జరిపిన లావాదేవీల్లో ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడి ఆచూకి గుర్తించిన పోలీసులు మారువేషంలో వెళ్లి ఆధారాలతో సహ అరెస్ట్ చేశారు.
కాల్ గర్ల్స్‌ను పంపుతానని ఆన్లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న జీవన్‌కుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు 1,80,000 నగదు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు జీవన్ కుమార్ ఫోన్ డేటా ఆధారంగా గతంలో మోసపోయిన బాధితుల జాబితా కూడా పోలీసులకు లభించింది. అమ్మాయిల ఫోటోలను ఎరగా వేసి వాటిని వాట్సాప్‌లో షేర్ చేసి, డబ్బులు వసూలు చేసి మోసం చేయటం, అది కుదరకపోతే, బెదిరింపులకు పాల్పడటం జీవన్ కుమార్‌కు అలవాటు. బాధితుల చాలా మంది ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రాకపోవటంతో జీవన్ కుమార్ ఇష్టారీతిన మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు.