Online Betting Scam: గతంలో భారత ప్రభుత్వం "మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్" మోసాలపై ఉక్కు పాదం మోపి, వారి కార్యకలాపాలను నిషేధించింది. అయినప్పటికీ అక్కడక్కడ వారి ఉనికి చాటుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఆన్ లైన్ బెట్టింగ్ మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ నట్టేట ముంచుతున్నారు. కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. ఈక్రమంలోనే మరోసారి అప్రమత్తమైన విశాఖపట్నం పోలీసులు.. మహాదేవ్ యాప్ ముఠాని చాకచక్యంగా పట్టుకున్నారు. తాజాగా కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు కూడా పంపించారు. ఇదిలా ఉండగా తాజాగా సిటీలో మరికొన్ని కార్యకలాపాలు వెలుగులోకి రావటంతో విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యన్నర్.. ఆదేశాల మేరకు డీసీపీ శ్రీనివాస రావు ఆధ్వర్యంలో లోతుగా దర్యాప్తు చేశారు. ఈక్రమంలోనే నగరానికి చెందిన పది మంది బుకీస్ ను అరెస్ట్ చేశారు. 


నగరానికి చెందిన ఎర్ర సత్తిబాబుకి.. సూరిబాబుతో దగ్గరి బంధుత్వం ఉంది. అయితే సూరిబాబు ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలోనే సత్తిబాబు కూడా బెట్టింగ్ కాశాడు. కానీ అతడికి నష్టం వచ్చేలా చేసి సూరిబాబు దాదాపు 8 లక్షల తనకు వచ్చేలా చేసుకున్నాడు. ఈ విషయం గుర్తించిన సత్తిబాబు పోలీసులను ఆశ్రయించాడు. ఈక్రమంలోనే కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే సుమార్ 63 బ్యాంక్ అక్కౌంట్లు ఫ్రీజ్ చేశారు. మొత్తం 36 అకౌంట్లు నుంచి వచ్చిన డాటా ప్రకారం 367 కోట్ల 62 లక్షల 97 వేల 649 రూపాయలు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. సదరు ఖాతాల నుంచి 75 లక్షల రూపాయలు స్తంభింపజేశారు. అలాగే బెట్టింగ్ కు పాల్పడుతున్న 12 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ఈ ముఠాలో ప్రధాని నిందితుడు అయిన సూరిబాబు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలానికి చెందిన వాడు. అయితే ఇతను EXCH333, EXCH666, LORDS EXCH, GO. PUNT, Betway, Rajabets, 1XBet, Melbet, Parimatch, 22Bet, BetWinner, Dafabet వంటి ఎక్స్చేంజీల  ద్వారా బెట్టింగ్ ఆడడం మొదలు పెట్టాడు. 


కొంతకాలానికి అతను EXCH666 నుంచి ఆతరైజేషన్ తీసుకొని బెట్టింగ్ బొకేగా మారి ఎక్కువగా ఇంటర్నేషనల్ మ్యాచెస్, ఐపీఎల్ మ్యాచెస్ పై ఫోకస్ చేశాడు. ఈ సమయంలో 20 నుంచి 30 మంది వ్యక్తుల వద్ద నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి ఒక్కొక్క మ్యాచ్ కి నాలుగు లక్షల రూపాయలు వరకు బెట్టింగ్ చేసేవాడు. ఇలా సంవత్సరానికి 5 నుంచి 6 కోట్లు బిజినెస్ టర్నోవర్ చేసేవాడు. ఇలా కలెక్ట్ చేసిన మొత్తాన్ని నగరంలో సూర్యభాగ్ కి చెందిన టూర్స్ అండ్ ట్రావెల్స్ నడిపిస్తున్న దినేష్ కుమార్ అనే వ్యక్తికి పంపించాడు. ఇందుకుగాను అతడికి రెండు శాతం కమిషన్ వచ్చేది. ఈ విధంగా తనకి తెలిసిన వ్యక్తులను కూడా బొకేలుగా మార్చి కమిషన్ కోసం బెట్టింగ్ నిర్వహించేవారు. ఇరు జట్టులకి ఒక్కొక్క పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది. గెలిచే అవకాశాలు ఉన్నా జట్టుకి తక్కువ పర్సెంట్ ఇస్తూ ఓడిపోయే అవకాశాలు ఉన్న జట్టుకి ఎక్కువ పర్సెంట్ ఇస్తూ మోసాలకు పాల్పడేవారు. ఇలా ఒక జుట్టు మీద బెట్టింగ్ వేసిన తర్వాత సదరు జట్టు ఓడిపోతుందన్న సమయంలో వేరొక జట్టు పైకి బెట్టింగ్ సర్వర్ ని ఆఫ్ చేస్తారు. మార్చడానికి అవకాశం లేని విధంగా ఇలా చేస్తూ మోసాలకు పాల్పడుతుంటారు. 


ఉదాహరణకు X జట్టు ఫేవరెట్ గా ఉన్న సందర్భంలో ఒక రూపాయికి 70 పైసలు ఇస్తూ వేరొక జట్టు Y కి 70 పైసలకు, రూపాయి వచ్చేటట్లు యాప్ లో బెట్టింగ్ కి అవకాశం కల్పిస్తారు. ముఖ్యంగా ముఠాలో ప్రముఖ వ్యక్తులు బాల్ టు బాల్ బెట్టింగ్ ఆడుతున్న సమయంలో లేదా మ్యాచ్ గెలుస్తుందన్న సమయంలో వాళ్ల స్వలాభం కోసం సదరు అప్లికేషన్ మరియు వెబ సైట్ ని వాళ్లకు నచ్చిన విధంగా ఆన్ చేయడం ఆఫ్ చేయడం చేస్తుండడంతో బాధితులు ఎక్కువగా నష్టపోయారు. సదరు విషయం తెలియక ప్రజలు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టిన సదరు గేమ్ యొక్క విన్నర్, లాస్ ఆప్షన్స్ హ్యాండ్లర్ చేతుల్లో ఉండటం చేత లాస్ అయినట్టు చూపిస్తారు. ఒకవేళ గెలిచినప్పటికీ వాళ్ల ఖాతాల ఐడీని బ్లాక్ చేస్తారు. ఈ విధంగా నకిలీ పత్రాలను ఉపయోగించి ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ మరియు కరెంట్ బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసిన డబ్బును శరవేగంగా వారి కార్పొరేట్ ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ రాకెట్ వెనుక వున్న ప్రధాన ముద్దాయిల కోసం గాలిస్తున్నట్టు విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యన్నర్ వివరించారు.  


క్రికెట్ బెట్టింగ్ స్కామ్ విధానం.. 


ముఖ్యంగా జూదం, బెట్టింగ్ ఆడాలనుకునే కస్టమర్ల కోసం ఐడీల విక్రయం చేస్తుంటారు. ఆన్లైన్ బెట్టింగ్ లో చేరడానికి బోకీస్ వెబ్ సైట్ కు సంబంధించిన లింక్ ను సోషల్ మీడియాలో పెడతారు. ఆ లింక్ ను ఉపయోగించి కస్టమర్లుకు.. ఈ ముఠా సృష్టించిన డమ్మీ WhatsApp నంబర్ అయిన లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ఐడీ రిక్వెస్ట్ వెళ్తుంది. ఇలా బుకీల నుంచి ఐడీ కొనుగోలు చేస్తారు. ఆపై వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ బెట్టింగ్ కు పాల్పడతారు. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ లో పెద్ద లాభాలను నిర్ధారించడానికి ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను ఉపయోగిస్తారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బుకీలు ఇతర క్రీడల్లో జూదాన్ని విస్తరించేందుకు ఈ మోసపూరిత యాప్ ను రూపొందిస్తారు. ఈ అప్లికేషన్ లు అప్పుడప్పుడు చిన్న విజయాలతో వినియోగదారులను ప్రలోభ పెడతాయి. అయితే బుకీలు, బెట్టర్ యొక్క నైపుణ్యం స్థాయితో సంబంధం లేకుండా గణనీయమైన లాభాలను ఆర్జిస్తూనే ఉన్నారు. సాఫ్ట్ వేర్ నిపుణులు ఈ ప్రోగ్రామ్లను అభివృద్ధి చేయడానికి మరియు వాటిని నిరంతరం కొత్త వెర్షన్లతో అప్డేట్ చేస్తారు. ఈ యాప్ లను అధికారిక స్టోర్లలో లేదా షేర్ చేసిన లింక్ల ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డబ్బును పోగొట్టుకునే సమయంలో వినియోగదారులను కట్టి పడేసేందుకు బుకీలు సాంకేతిక నిపుణులను నియమిస్తారు. సాఫ్ట్ వేర్ నిపుణులు వినియోగదారులను మోసం చేయడానికి మరియు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ లో బుకీల గణనీయమైన లాభాలను నిర్ధారించడానికి ప్రత్యేకమైన యాప్లను రూపొందించారు. ఈ మోసపూరిత యాప్లు బెట్టింగ్లో కోట్లాది రూపాయల మోసపూరిత లావదేవలకి దారితీస్తాయి. ఆన్లైన్ బెట్టింగ్కు సంబంధించిన స్కామ్లలు వాటి బారిన పడిన వారికి తీవ్రమైన ఆర్థిక నష్టాలు మరియు మానసిక క్షోభను కలిగిస్తాయి.