Chandragiri Tirupati District తిరుపతి: సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించే సాంప్రదాయ ఈవెంట్ జల్లికట్టు. తిరుపతి జిల్లాలో ఆదివారం పశువుల పండుగ (జల్లికట్టు) అట్టహాసంగా జరిగింది. చంద్రగిరి పట్టణంలోని రంగంపేటలో ఈ ఏడాది తొలిసారి జల్లికట్టు నిర్వహించారు. కానీ జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. ఎద్దు దాడిలో ఓ వ్యక్తి మృతిచెందడంతో విషాదం నెలకొంది.




చంద్రగిరి పట్టణంలో నిర్వహించిన పశువుల పండుగలో పాల్గొనేందుకు వేలాదిగా యువకులు, ప్రజలు తరలి వచ్చారు. జల్లికట్టు నిర్వహణ లోపంతో పోట్లగిత్తలు జనాలు పైకి దూసుకెళ్లాయి. నడింపల్లెకుకి చెందిన వెంకటమునిపై ఎద్దు దాడి చేసింది. ఒక్కసారిగా ఛాతీపై ఎద్దు గట్టిగా కొట్టడంతో పరిస్థితి విషమంగా మారింది. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో గాయపడ్డ వెంకటమునిని చివరికి‌ ఆటోలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఆసుపత్రిలో పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సరదా కోసం నిర్వహించిన పశువుల పండుగ ఒకరి ప్రాణం బలి తీసుకోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.