Nursing Student Death In Bhadrachalam: భద్రాచలంలో (Bhadrachalam) ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతురాలి బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భద్రాచలంలోని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పారా మెడికల్ కాలేజీలో విద్యార్థిని కారుణ్య ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. గురువారం ఉదయం కాలేజీ ప్రాంగణంలో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను యాజమాన్యం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు, విద్యార్థులు శుక్రవారం ఉదయం కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వాస్పత్రి నుంచి ర్యాలీగా కళాశాల వద్దకు వచ్చి నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారికి నచ్చచెప్పేందుకు యత్నించారు. కళాశాలకు వచ్చిన ఛైర్మన్‌పై బంధువులు, విద్యార్థులు దాడికి యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.
న్యాయం చేయాలని డిమాండ్
మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నర్సింగ్ విద్యార్థిని కారుణ్య కళాశాల భవనం వద్ద కింద పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను గమనించిన తోటి విద్యార్థినులు వెంటనే యాజమాన్యానికి సమాచారం ఇవ్వగా.. వారు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే, యాజమాన్యం పొంతన లేని సమాధానాలు చెబుతోందని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని.. పూర్తి స్థాయిలో విచారణ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి దర్యాప్తు తర్వాతే కారుణ్య మృతికి కారణాలు వెల్లడవుతాయని తెలిపారు.