Nurse Molested at Hospital: కోల్‌కతా హత్యాచార ఘటనపై బెంగాల్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలు జరుగుతున్నా మరో వైపు లైంగిక దాడుల ఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి. బెంగాల్‌లోనే బిర్బం జిల్లాలో ఓ గవర్నమెంట్‌ హాస్పిటల్‌లో నర్స్‌ని ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు. తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న వ్యక్తి హాస్పిటల్‌కి వచ్చాడు. కనీసం నిలబడే ఓపిక కూడా లేకపోవడం వల్ల స్ట్రెచర్‌పైన లోపలికి తీసుకొచ్చి ట్రీట్‌మెంట్ మొదలు పెట్టారు. ఓ నర్స్‌ అతనికి సెలైన్ ఎక్కించడానికి వెళ్లింది. ఆ సమయంలో నర్స్‌ని ఆ వ్యక్తి అసభ్యంగా తాకాడు. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేశాడు. అంతే కాదు. బూతులు కూడా మాట్లాడాడు. ఇదంతా ఆమె హాస్పిటల్ యాజమాన్యానికి వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే హాస్పిటల్‌కి వచ్చిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నర్స్ ఇచ్చిన కంప్లెయింట్ మేరకు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై నర్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నైట్‌ షిప్ట్‌లో ఇదంతా జరిగిందని వివరించింది. 


"తీవ్ర జ్వరంతో ఓ వ్యక్తి రాత్రి పూట హాస్పిటల్‌కి వచ్చాడు. డాక్టర్‌ల సలహా మేరకు అతనికి నేను సెలైన్ ఎక్కించడానికి వెళ్లాను. ఆ సమయంలోనే నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. బూతులు తిట్టాడు. ఓ పేషెంట్ ఇలా ప్రవర్తిస్తాడని ఎలా అనుకుంటాం. రోజురోజుకీ మాకు భద్రత లేకుండా పోతోంది. ఇక్కడ పని చేయలేకపోతున్నాం"


- నర్స్


ఈ ఘటనపై అక్కడి డాక్టర్లూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చీ రాగానే ఆ పేషెంట్ నర్స్‌తో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పారు. నిందితుడిపై చర్యలు తీసుకోకపోతే విధులను బహిష్కరించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. 


"రాత్రి పూట హాస్పిటల్‌కి వచ్చాడు. కొన్ని పరీక్షలు చేసి ట్రీట్‌మెంట్ ఇవ్వాలని ఆ పేషెంట్ కుటుంబ సభ్యులకు చెప్పాం. బెడ్ కూడా సిద్ధం చేశాం. సెలైన్ ఎక్కించడానికి మా నర్స్ అక్కడికి వెళ్లింది. అప్పుడే అతను అసభ్యంగా ప్రవర్తించాడు. మందలించినా పట్టించుకోలేదు. మళ్లీ ఇబ్బంది పెట్టాడు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఏ చర్యలూ తీసుకోకపోతే విధులను బహిష్కరిస్తాం"


- డాక్టర్లు 


కోల్‌కతా హత్యాచార కేసుపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య సిబ్బందికి ఎలాంటి భద్రత లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది. FIR నమోదు చేసిన తీరుపైనా మండి పడింది. ప్రభుత్వాన్నీ మందలించింది. సీబీఐ ఈ కేసుని విచారిస్తోంది. నిందితుడితో పాటు మరో ఐదుగురికి లై డిటెక్టర్ టెస్ట్‌లు చేసింది. ఆర్‌జీ కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్ ఘోష్‌ని ఇండియన్ మెడికల్ ఏజెన్సీ సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో అనుమానితుడు గానూ ఉండడం వల్ల అందరి దృష్టి సందీప్‌ ఘోష్‌పైనే ఉంది. ఆ రాత్రి ఏం జరిగిందనే దానిపై సీబీఐ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. నిందితుడు సంజయ్ రాయ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. 


Also Read: Viral News: రూ.11 కోట్ల విలువైన ఐఫోన్‌లు చోరీ, ట్రక్ డ్రైవర్‌కి మత్తు ఇచ్చి దొంగతనం