NTR District News : అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉయ్యాల ఊగిన ఆ చిన్నారికి ఉయ్యాలే ఉరితాడైది. చీరతో వేసిన ఉయ్యాలలో ఏడేళ్ల చిన్నారి ఊగుతుండగా ప్రమాదవశాత్తు మెడకు చుట్టుకుని చిన్నారి మృతి చెందింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తానూరి గోపి, తిరుపతమ్మ దంపతుల పెద్ద కూతురు లలితశ్రీ నవాబుపేట ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుంది.  తల్లిదండ్రులు కూలిపనుల కోసం బయటకు వెళ్లగా చీరతో కట్టిన ఉయ్యాలలో లలిత శ్రీ ఆడుకుంటోంది. ఒక్కసారిగా చీరకొంగు మెడకు బిగుసుకొని ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చుట్టుపక్కల వారు గమనించి చిన్నారిని  నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే చిన్నారి చనిపోయిందని వైద్యులు తెలిపారు. అల్లరు ముద్దుగా పెంచుకున్న కూతురు విగతజీవిగా పడిఉండడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపించారు.


అనుమానంతో భార్యను చంపేశాడు..


కొందరు వ్యక్తులు అప్పటి వరకు బాగానే ఉన్నా.. అప్పటికప్పుడు మానవ మృగంలా ప్రవర్తిస్తారు. మానవత్వాన్ని మరచిపోతారు. ఏం చేస్తున్నామన్నది పూర్తిగా మరచిపోయి విచక్షణా రహితంగా ప్రవర్తిస్తారు. కట్టుకున్న భార్య, కని, పెంచిన తల్లిదండ్రులు, జన్మను ఇచ్చిన పిల్లలు అన్న విచక్షణ ఏదీ ఉండదు. వారిలో నాటుకున్న అనుమానం, కోపం, ఆవేశం వారిని మృగంలా మారుస్తుంది. అలాగే ప్రవర్తించాడు ఓ దుర్మార్గుడు. మనసులో నాటుకున్న అనుమానపు బీజాన్ని రోజు రోజుకూ పెంచి పెద్ద చేసుకున్నాడు. చివరికి అది ఇతరులను కాటే వేసేంత వరకు ఆ అనుమానపు పామును పెంచి పెద్ద చేశాడు. తనే జీవితం అనుకుని, చచ్చి పోయేంత వరకు తనతోనే బతుకు అనుకున్న ఆలిని, అర్ధాంగిని మట్టు బెట్టాడు. చివరికి తన చిన్నారి కూతురు తన తల్లిని ఎలా చంపాడో పోలీసులు వివరించడంతో కటకటాల పాలయ్యాడు. 


బిడ్డ కళ్లెదుటే


బిడ్డ నల్లగా పుట్టిందనే కారణంతో ఓ ప్రబుద్ధుడు తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. బిడ్డ కళ్ల ఎదుటే తన ఆలిని అంతం చేశాడు. తర్వాత.. అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిందని నమ్మబలికాడు. అందరూ సహజంగా మరణించిందనే అనుకున్నారు. కానీ తన మూడేళ్ల బిడ్డ నోటి నుండి తన తల్లి ఎలా చనిపోయిందన్న విషయం బయటకు రావడంతో జైలుకు వెళ్లాడు. అసలేం జరిగిందంటే.. ఒడిశా రాష్ట్రం నవరంగపూర్ సిటీ పరిధిలోని సిలాటిగావ్ గ్రామానికి చెందిన మాణిక్ ఘోష్ కు కారాగావ్ అనే గ్రామానికి చెందిన లిపికా మండల్ తో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. తర్వాత ఆ దంపతులు ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు ఉపాధి నిమిత్తం వలస వచ్చారు. ఈ దంపతులకు రెండున్నరేళ్ల క్రితం ఓ పాప జన్మించింది. ఐతే తాను, తన భార్య ఇద్దరూ తెల్లగా ఉండటం, పాప మాత్రం నల్లగా ఉండటంతో మాణిక్ ఘోష్ కు భార్య లిపికాపై అనుమానం వచ్చింది. ఈ విషయంపై తరచూ భార్యతో గొడవ పడే వాడు మాణిక్ ఘోష్. క్రమంగా తన అనుమానం పెరిగి పెద్దది అయింది. మాణిక్ రోజురోజుకూ విపరీతంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. దీంతో విసిగి పోయిన లిపికా జనవరిలో తన పుట్టింటికి వెళ్లి పోయింది. 


వచ్చీరానీ మాటలతో తాతకు విషయాన్ని చెప్పిన చిన్నారి..


పుట్టింటికి వచ్చిన లిపికాను తల్లిదండ్రులు సర్దిచెప్పి కాకినాడకు కాపురానికి పంపారు. ఐతే సెప్టెంబరు 18వ తేదీన రాత్రి లిపికాకు మూర్చ వచ్చింది. దీంతో భర్త మాణిక్ అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు లిపికాను పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. మూర్చ వల్లే లిపికా చనిపోయిందని నమ్మబలికాడు. కానీ మెడపై కమిలిపోయినట్లు గుర్తించారు వైద్యులు. ఇదే విషయాన్ని కాకినాడ పోలీసులు చెప్పారు. తర్వాత లిపికా తల్లిదండ్రులు కాకినాడ వచ్చి చిన్నారిని తమతో పాటు తీసుకెళ్లారు. అసలు లిపికా ఎలా చనిపోయిందో తెలుసుకుందామని.. చిన్నారిని తన తల్లి ఎలా ప్రాణాలు కోల్పోయిందో అడిగే ప్రయత్నం చేశారు. తాతకు ఆ చిన్నారి విస్తుపోయే నిజాలు బయట పెట్టింది. తన తండ్రే గొంతు పట్టుకున్నాడని.. అమ్మ కాళ్లు, చేతులు కొట్టుకుందని.. తర్వాత అమ్మ కదలకుండా నిద్ర పోయిందని వచ్చీ రానీ మాటలతో ఆ చిన్నారి తన తాతకు అన్ని విషయాలు చెప్పింది. దీంతో ఆ తాత తన మనవరాలిని పట్టుకుని కాకినాడకు వచ్చి పోలీసుల వద్దకు వెళ్లాడు. పోలీసుల ముందు కూడా ఆ చిన్నారి, తన తల్లిని తండ్రి ఎలా చంపాడో చెప్పింది. పోలీసులు మాణిక్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. తను నిజంగానే తన భార్య లిపికాను చంపినట్లు ఒప్పుకున్నాడు.