NTR District News : కొద్ది రోజుల క్రితం ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో నాలుగు కోట్లకు పైగా నగదు పట్టుబడిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో రూ.1.90 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా నగదును తరలిస్తుండడంతో నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తోన్న ప్రైవేట్ బస్సులో ఈ నగదు దొరికింది. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా తెలంగాణలో పొలం అమ్ముకుని ఆ డబ్బుతో ఆంధ్రాలో పొలం కొని రిజిస్ట్రేషన్ నిమిత్తం డబ్బులు తీసుకు వెళ్తున్నట్టు తెలియజేశారన్నారు. ఈ డబ్బును ఆదాయపు పన్ను కార్యాలయానికి  అందజేస్తున్నామని డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. 


 


ఇటీవల ప.గోలో భారీగా నగదు స్వాధీనం 


ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సీక్రెట్‌గా ఉంచిన బ్యాగులో పెద్ద ఎత్తున నోట్ల కట్టలను పోలీసులు పట్టుకున్నారు. ఏప్రిల్ 1న పశ్చిమ గోదావరి జిల్లా  నల్లజల్ల వద్ద పోలీసులు ప్రైవేట్ ను బస్సులో సోదాలు చేశారు. జాతీయ రహదారిపై ఉన్న వీరవల్లి టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నగదు రవాణా చేస్తున్నట్లుగా గుర్తించడంతో పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు మొత్తం రూ. నాలుగు కోట్ల 76 లక్షలు ఉంది.  బస్సు శ్రీకాకుళం నుంచి గుంటూరు వెళ్తోందని పోలీసులు తెలిపారు. బస్సు పద్మావతి ట్రావెల్స్ కు చెందినది కాగా బస్ నెంబర్ ఏపీ AP 39 TB 7555 . బస్సులో  పాసింజర్ సీట్ల కింద లగేజ్ కేరియర్ లో ప్రత్యేక బ్యాగుల్లో డబ్బును తరలిస్తున్నారు. 


హవాళా నగదుగా అనుమానం 


ఎవరు ఆ లగేజీని ఎవరు బుక్ చేశారు, ఎవరికి చేర వేస్తున్నారు వంటి అంశాలపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఈ సోదాల్లో బస్సు డ్రైవర్, క్లీనర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరితో పాటు ఆ నగదుతో సంబంధం ఉందని భావిస్తున్న మరో ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలోనే పెద్ద మొత్తంలో నగదు తరలిస్తుంటారు. సోదాల్లో కోట్లకు కోట్లు దొరుకుతుండడంతో పోలీసులు నిఘా పెంచుతున్నారు. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేకపోయినా పెద్ద మొత్తంలో నగదును బస్సుల్లో సీక్రెట్‌గా ఎవరికీ అనుమానం రాకుండా తరలించడంతో హవాళా లావాదేవీలేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం గిద్దలూరు ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించిన కారులో రూ. ఐదు కోట్ల వరకూ నగదు తీసుకెళ్తూ తమిళనాడు పోలీసులకు పట్టుబడిన అంశం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది.