వెంకటేశ్వర స్వామి సాక్షిగా మరో సారి ఆలయ నిబంధలను టీటీడీ అధికారులు తుంగలో తొక్కారు. నిబంధనలను అమలు చేయాల్సిన అధికారులే తమ బంధువులు కోసం నిబంధనలకు పాతర వేశారు. శ్రీవారి అభిషేకం సమయంలో సిబ్బంది ప్రవేశించే బయోమెట్రిక్ ద్వారం నుంచి టీటీడీ ఉన్నతాధికారికి చెందిన బంధువులు ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీవారి ఆలయ ఉద్యోగులకు ప్రవేశ మార్గమైన బయోమెట్రిక్‌ను తమ బంధువులు కోసం ఇష్టానుసారంగా ఉన్నతాధికారి వాడేస్తున్న తీరు బయటపడింది. దీంతో టీటీడీ తీరుపై భక్తుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
శుక్రవారం జరిగే అభిషేక సేవకు ప్రభుత్వం తరపున ఈవో కానీ ఛైర్మన్ కానీ.. ఒకరే హాజరయ్యే వెసులుబాటు ఉంటుంది. నేటి అభిషేక సేవకు ఇద్దరూ.. వారి బంధువులతో హజరు కావడంతో ఏళ్ల క్రితం ఒకటో నెంబర్ వస్త్రం టిక్కెట్టు కొనుక్కున్న భక్తుడికి ఇబ్బందులు తలెత్తాయి.
తిరుమల ఆలయంలోకి ఇలా ఎవరంటే వారు.. ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో వెళ్లకూడదు. ఇది కేవలం ఆలయంలో పనిచేసే ఉద్యోగులు వెళ్లేందుకు ఉద్దేశించిన బయోమెట్రిక్ మార్గం. ఈ దారిలో భక్తులను అనుమతించకూడదు. కానీ, వచ్చింది పెద్ద సారుకు చెందిన బంధువులు కావడంతో ఇలా దారి ఇచ్చేశారు. తిరుమలలో భక్తుల గొడవ జరిగి మూడు రోజులు గడవకముందే.. కొండ మీద ఇలా నిబంధనలకు తూట్లు పొడవడం విమర్శలకు తావిస్తోంది.
తిరుమల ఆలయంలో ప్రవేశానికి చాలా స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అర్హత ఉన్నవారు మహద్వారంలో, లేకపోతే క్యూ కాంప్లెక్సులోనే వెళ్లాలి. కానీ ఇవాళ శుక్రవార అభిషేక సమయంలో దానిని పాటించలేదు. కొంతమంది బయట వ్యక్తులు ఇలా నేరుగా ఆలయంలోకి వెళ్లిపోయారు. వీరికి అభిషేకం టికెట్లు ఉన్నా.. వైకుంఠం ద్వారా మాత్రమే ఆలయంలోకి రావాలి. అలాగే టీటీడీ ప్రత్యేక ఆహ్వానితురాలు కూడా ఒకరు ఇలా బయోమెట్రిక్ గుండా వెళ్లారు. బోర్డు సభ్యులకు మహాద్వారం గుండానే వెళ్లే వెసులుబాటు ఉంది. ఈవిడకు ఆ హోదా ఇచ్చారు కాబట్టి, అలా వెళ్లారని భావిస్తున్నారు. నిజంగా బోర్డు సభ్యులకు ఉన్న అధికారాలన్నీ ఆహ్వానితులకు ఉన్నాయా అన్న దానిపై స్పష్టమైన నిబంధనలు లేవు. కొన్నాళ్ల క్రితం ఛైర్మన్ సుబ్బారెడ్డి కూడా తమ వెంట కొందరిని.. బయోమెట్రిక్ మార్గం గుండా ఆలయంలోకి తీసుకెళ్లారు.
ఇక శుక్రవారం అభిషేకానికి టీటీడీ ఈవో లేదా టీటీడీ ఛైర్మన్ లలో ఒకరు హాజరై సర్కారు హారతి తీసుకుంటారు. సాధారణంగా ఒక శుక్రవారం ఒకరు, మరోవారం ఇంకొకరు వస్తారు. ఇవాళ ఇద్దరూ హాజరయ్యారు. దీని వల్ల స్వామి అభిషేక సేవ కోసం ఎన్నాళ్లుగానో వేచి చూసి ఒకటో నెంబర్ వస్త్రం టికెట్ కొనుక్కున్న భక్తుడు.. అసహనానికి గురయ్యారు. చైర్మన్, ఈవో.. వారి సన్నిహితులు ఎక్కువ అవడం వల్ల.. ఈ టికెట్ కొనుక్కున్న భక్తుడు స్వామి వారికి దూరంగా నిలబడాల్సి వచ్చింది. దీంతో ఆయన గుడిలో అధికారులతో వాగ్వాదానికి దిగారని సమాచారం. ఇలాంటి వివాదాలు తరచుగా వస్తూనే ఉన్నాయి. అయితే, వీటిని పరిష్కరించాల్సిన వాళ్లే వివాదాలకు కారణం అవుతున్నారు. ఈ విషయాన్ని వారు గుర్తించాల్సి ఉంది.