Tiruamla : తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఎండ వేడి నుంచి స్వామి వారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలురకాల మధురఫలాలను స్వామి వారికి నివేదించారు అర్చకులు. ఈ వేడుకల కోసం ఆకర్షణీయంగా వసంత మండపాన్ని రూపొందించారు అధికారులు. అలాగే పలురకాల జంతువులు, చెట్ల ప్రతిరూపాలతో శేషాచల అడవిని తలపించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ ఉత్సవాన్ని నిర్వహించలేకపోయింది టీటీడీ. రెండేళ్ల తరువాత భక్తులకు ఈ వేడుకలో పాల్గొనే అవకాశం లభించింది. ఇందులో భాగంగా ముందుగా శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆస్థానంలో నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామి వారు నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి తరలివెళ్లారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు మలయప్ప స్వామి వారికి స్నపనతిరుమంజనం శోభాయమానంగా నిర్వహించారు అర్చకులు.
వేదపండితుల పఠనాలతో
ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం అర్చకులు నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధాలతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనసాగమోక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
రేపు స్వర్ణ రథోత్సవం
సాయంత్రం అక్కడి నుంచి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారు ఆలయానికి చేరుకున్నారు. వసంతోత్సవాలు పురస్కరించుకుని టీటీడీ ఉద్యానవనం అధికారులు వసంత మండపాన్ని శేషాచలం అడవిని తలపించేలా తీర్చిదిద్దారు. పచ్చని చెట్లు, పుష్పాలతో పాటు పలురకాల జంతువుల ఆకృతులను ఏర్పాటు చేశారు. వీటిలో పులి, చిరుత, కోతులు, పునుగుపిల్లి, కొండచిలువ, కోబ్రా, నెమలి, హంసలు, బాతులు, హమ్మింగ్ బర్డ్, మైనా, చిలుకలు ఉన్నాయి. ఇవి భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వసంతోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు శ్రీభూదేవి సమేత మలయప్ప స్వామి వారు స్వర్ణరథంపై తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహించనున్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి దాదాపు 10 గంటల పడుతోంది. వచ్చే మూడు రోజులు కూడా సెలవులు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. బుధవారం తిరుమల శ్రీవారిని 88,748 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 47 వేల మంది టోకెన్ లేకుండా దర్శించుకున్న భక్తులున్నారు. అలాగే ముందుగా ఆన్‌లైన్ లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తీసుకున్న 26 వేల మంది కూడా దర్శనం చేసుకున్నారు. ఆర్జితసేవ, వర్చువల్ సేవా టికెట్లు, టూరిజం శాఖ ద్వారా వచ్చిన వారు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. బుధవారం రూ.4.82 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. శ్రీవారికి 38,558 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.