Chigurupati Jayaram Case : ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసులో నాలుగేళ్ల తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని మాత్రమ దోషిగా కోర్టు తేల్చింది. మిగిలిన పదకొండు మంది నిందితుల్ని నిర్దోషులుగా తేల్చారు. వీరిలో సూర్య ప్రసాద్ అనే సినిమా నటుడుతో పాటు ఏసీపీ మల్లారెడ్డి, మరో ఇద్దరు సీఐలు ఉన్నారు. ఒక్క రాకేష్ రెడ్డి మాత్రమే చిగురుపాటి జయరామ్ ను హత్య చేసినట్లుగా కోర్టు భావించింది. రాకేష్ రెడ్డికి శిక్షను ఈ నెల 9వ తేదీన కోర్టు ఖరారు చేయనుంది. హనీ ట్రాప్ చేసి జయరామ్ ను ట్రాప్ చేసిన రాకేష్ రెడ్డి తర్వాత హత్య చేసినట్లుగా కోర్టుకు పోలీసులు ఆధారాలను సమర్పించారు.
2019 జనవరి 31న చిగురుపాటి జయరామ్ హత్య !
చిగురుపాటి జయరాం ఎక్స్‌ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ గా ఉండేవారు. అప్పటికే ఎక్స్ ప్రెస్ టీవీ మూతపడింది. 2019 జనవరి 31న కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. . జాతీయ రహదారిపై కీసర సమీపంలో కారులో మృతదేహన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు హైదరాబాదుకు చెందిన చిగురుపాటి జయరామ్‌గా గుర్తించారు. జయరామ్ మృతదేహంపై రక్తపు గాయాలు ఉండటంతో ఎవరో హత్య చేసి కారులో పడేసి వెళ్లి ఉంటారనే అనుమానంతో దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. రాకేష్ రెడ్డి విషయం వెలుగులోకి వచ్చింది.
సంచలనం సృష్టించిన చిగురుపాటి జయరాం హత్య
చిగురుపాటి జయరామ్‌కు డబ్బులు అప్పుగా ఇచ్చిన రాకేష్ రెడ్డి వాటిని తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటూ తిరుగుతూండటంతో హనీట్రాప్ ద్వారా ఇంటికి రప్పించి హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. మొత్తంగా పోలీసులు 388 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు. రాకేష్ రెడ్డికి పోలీసులు కూడా సహకరించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పట్లోనే ఏసీపీ, సీఐలపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. రాకేష్ రెడ్డి 4 సంవత్సరాలుగా జైల్ లో ఉంటున్నారు. బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకూ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ కేసులో హనీ ట్రాప్ ద్వారా ప్రయత్నించింది..నటుడు సూర్య ప్రసాద్ అని పోలీసులు ప్రకటించారు. అయితే అతనిని కూడా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఆధారాలను పోలీసులు చూపించలేకపోయినట్లుగా తెలుస్తోంది.
అంచెలంచెలుగా ఎదిగిన చిగురుపాటి జయరాం !
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జయరామ్ సాధారణ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. గతంలో ఎక్స్‌ప్రెస్ టీవీ ప్రారంభించి నష్టాలు రావడంతో మూసేశారు. కోస్టల్ బ్యాంక్ అధినేతగా, ఎక్స్‌ప్రెస్ టీవీ ఎండీగా ఆయన సుపరిచుతులు. ఔషధాలు, అద్దాల తయారీ పరిశ్రమల్లోనూ వాటాలున్నాయి. భార్యాపిల్లలతో కలిసి అమెరికాలోని ఫ్లోరిడాలో ఉండేవారు. ఇండియాలో వ్యాపారల కోసం తరచూ వచ్చే వారు. అయితే ఇక్కడ వ్యాపారాల్లో వచ్చిన సమస్యలు ఇతర సమస్యల కారణంగా ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. చివరికి హత్యకు గురయ్యారు.