BS Yediyurappa's Chopper Landing :   గాల్లో నుంచి దూరంగా హెలికాఫ్టర్ చిన్నగా కనిపిస్తోంది. రాను రాను పెద్దదవుతోంది. ల్యాండింగ్ దగ్గరకు వచ్చేసింది. ల్యాండ్ అవడానికి ప్రయత్నిచింది కానీ. సాధ్యం కావడం లేదు. ల్యాండ్ అవడానికి చేసిన ప్రయత్నం వల్ల హెలిప్యాడ్ వద్ద దుమ్ము పైకి లేచింది.. దాంతో పాటు మళ్లీ హెలికాఫ్టర్ కూడా పైకి లేచింది. ల్యాండ్ కాలేకపోయింది. ఆ హెలికాఫ్టర్‌లో వీఐపీ ఉన్నారు. ఇంకేముంది ఆయన కోసం ఎదురు చూస్తున్న వారికి ఉండే ఉత్కంఠ అంతా ఇంతా కాదు. అదే పరిస్థితి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఆ అభిమానులకు కలిగింది. దాదాపుగా గంట సేపు టెన్షన్ పెట్టిన ఈ ఘటన కరణాటకలోని జరిగింది.                                                 


 





 


కర్ణాటకలో త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ విజయం కోసం యడ్యూరప్ప కృషి చేస్తున్నారు.  విజయ్ సంకల్ప్ యాత్రలు నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు కలబురిగి వెళ్లారు. ఆయన  ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో  సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్..  హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో విజయ్ సంకల్ప్ యాత్రలో పాల్గొనేందుకు యడియూరప్ప వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.


హెలికాప్టర్ దిగాల్సిన హెలిపాడ్ గ్రౌండ్‌లో ప్లాస్టిక్, ఇతర వ్యర్ధ పదార్ధాలు ఉండటంతో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో సమస్యలు తలెత్తాయి. పైలట్ చివరి నిమిషంలో చాకచక్యంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయకుండా ముందుకు తీసుకు వెళ్లారు. అనంతరం అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో సురక్షితంగా కిందకు ల్యాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.                                          


అయితే యడ్యూరప్ప ఈ ఘటనపై ఎలాంటి ఆందోళన చెందలేదని బజేపీ వర్గాలు చెబుతున్నాయి. విజయ సంకల్ప యాత్రలన్నీ యధావిధిగా జరుగుతాయని బీజేపీ ప్రకటించింది. వయసు కారణంగా యడ్యూరప్పను ముఖ్యమంత్రి పీఠం నుంచి బీజేపీ హైకమాండ్ తప్పించింది. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారన్న ప్రచారం జరిగింది. కానీ ఇటీవల బీజేపీ హైకమాండ్ ఆయనను  బుజ్జగించి బీజేపీ తరపున ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేలా ఒప్పించగలిగారని చెబుతున్నారు.