Adani Group Stocks: మీరు ఒక విచిత్రం గమనించారా?, అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ను ఒక అమెరికన్‌ కంపెనీ పడగొడితే, మరో అమెరికన్‌ కంపెనీ నిలబెడుతోంది. అమెరికన్‌ షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ‍‌(Hindenburg Research) నివేదిక తర్వాత, అదానీ స్టాక్స్‌లో నెల రోజుల పాటు పతనం కొనసాగింది. నాలుగు రోజుల క్రితం, గురువారం (02 మార్చి 2023) నాడు, జీక్యూజీ పార్టనర్స్ (GQG Partners), సమస్యల్లో ఉన్న అదానీ స్టాక్స్‌లో రూ. 15,446 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టింది. ఏ ముహూర్తాన జీక్యూజీ పార్ట్‌నర్స్‌ అదానీ గ్రూప్‌లోకి అడుగు పెట్టిందో గానీ, అక్కడి నుంచి గ్రూప్‌ షేర్లు మంచి లాభాలను రుచి చూడడం ప్రారంభించాయి.


వరుసగా ఐదో ట్రేడింగ్‌ రోజున, ఇవాళ (సోమవారం, 06 మార్చి 2023) కూడా అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ పండుగ చేసుకుంటున్నాయి, మంచి ర్యాలీని చూశాయి. ఇవాళ మార్కెట్ ప్రారంభమైన వెంటనే, అదానీ గ్రూప్‌లోని నాలుగు స్క్రిప్స్‌ 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 13 శాతం పరుగులు తీసింది.


ఈ ఐదు ట్రేడింగ్‌ రోజుల్లోనే అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ కౌంటర్‌ 90.12 శాతం లాభాలు ఆర్జించింది. ఈ స్టాక్ ఇవాళ రూ. 2,135 గరిష్టానికి చేరింది. 


అప్పర్‌ సర్క్యూట్‌ తాకిన అదానీ స్టాక్స్‌
అదానీ గ్రూప్‌లోని నాలుగు స్టాక్స్‌ - అదానీ పవర్ ‍‌(Adani Power), అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy), అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission), అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas) 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌లో లాక్‌ అయ్యాయి. అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ లిమిటెడ్‌ ‍‌(Adani Ports and Special Economic Zone Ltd) స్టాక్‌ 4 శాతం ఎగబాకింది. ఇవి కాకుండా, ఈ ప్యాక్‌లోని అంబుజా సిమెంట్ (Ambuja Cements), ACC సిమెంట్ షేర్లు 2 శాతం చొప్పున లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.


నాలుగు కంపెనీల్లో వాటాలు కొనుగోలు 
GQG పార్టనర్స్ సంస్థ అమెరికా హెడ్‌ క్వార్టర్స్‌గా పని చేస్తున్నా, ఆస్ట్రేలియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయింది. బ్లాక్ డీల్స్‌ ద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో ఈ కంపెనీ వాటాలు కొన్నది. ఇందుకోసం  రూ. 15,446 కోట్లను వెచ్చించగా, ఈ స్టాక్స్‌లో వచ్చిన ర్యాలీ కారణంగా, ఆ తర్వాత రెండు రోజుల్లోనే GQG పార్టనర్స్ పెట్టుబడి విలువ రూ. 18,548 కోట్లకు పెరిగింది. మొత్తంగా, కేవలం రెండు రోజుల్లోనే రూ. 3,100 కోట్ల లాభాన్ని ఆయన సంపాదించింది. ప్రెసిడెంట్ & చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ రాజీవ్ జైన్ ఆధ్వర్యంలో GQG పార్టనర్స్ నడుస్తోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.