North Carolina Mass Shooting:
రాలీలో కాల్పులు..
అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియా రాజధాని రాలీలో ఓ మైనర్ కాల్పులు జరపగా...ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ ఆఫ్ డ్యూటీ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని నీస్ వద్ద గ్రీన్‌వే సమీపంలో సాయంత్రం ఈ దాడి జరిగినట్లు మేయర్ మారీ అన్నా బాల్డ్‌విన్ వెల్లడించారు. "ఇదెంతో విషాదకరమైన రోజు. సాయంత్రం 5 గంటల తరవాత ఒక్కసారిగా కాల్పులు మొదలయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు" అని చెప్పారు. రాలీ పోలీస్ విభాగం కూడా మృతుల సంఖ్యను 5గా నిర్ధరించింది. రాత్రి 9.30 గంటల తరవాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. నిందితుడు బాలుడని, అక్కడే సమీపంలో ఓ ఇంట్లో నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఒకరి తీవ్రంగా గాయపడ్డారని, పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ కాల్పులకు కారణమేంటనేది ఇంకా తెలియరాలేదు. అమెరికాలో గన్ వయలెన్స్ విపరీతంగా పెరుగుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటి వరకూ కాల్పుల కారణంగా...34,000 మంది చనిపోయారు. వీరిలో సగానికి పైగా తమకు తాము కాల్చుకుని చనిపోయిన వాళ్లే ఉన్నారు. ఆత్మరక్షణ కోసం తుపాకీ తీసుకుని...చివరకు ఆత్మహత్య చేసుకుంటున్నారు చాలా మంది. ఈ హింసను అడ్డుకునేందుకు ప్రస్తుతం తీసుకుంటున్న కట్టడి చర్యలు చాలవని, వీటిని ఇంకా కఠినతరం చేయాల్సిన అవసరముందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
వరుస ఘటనలు..
అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలకు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో వాషింగ్టన్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందాడు. వైట్ హౌస్‌కు సమీపంలోనే ఈ కాల్పులు జరిగాయి. వాష్టింగన్ డీసీలోని 14వ, యూస్ట్రీట్ నార్త్‌వెస్ట్‌లో ఓ సంగీత కచేరి కార‍్యక్రమంలో ఈ కాల్పులు జరిగాయి. ఇది వైట్ హౌస్‌కు కేవలం రెండు మైళ్ల దూరంలో ఉంది. ఈ కాల్పుల భయంతో ఒక్కసారిగా రోడ్లపై జనం పరుగులు తీశారు. అయితే కాల్పులు జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందగా, అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. మే చివరి వారంలో టెక్సాస్ కాల్పులతో దద్దరిల్లింది. టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 18 మంది చిన్నారులు సహా మొత్తం 21 మంది మరణించారు. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఓ ప్రైమరీ స్కూలులో ఓ టీనేజర్ కాల్పులు జరిపాడు. పాఠశాలలో ఉన్న 18 మంది చిన్నారులు మృతి చెందగా, మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు.అమెరికాలో కాల్పుల ఘటనలు అధికం కావడం వల్ల తుపాకీ నియంత్రణ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల తెలిపారు. 18-21 ఏళ్ల మధ్య వయసున్న వారు తుపాకులు కొనుగోలు చేయకుండా చట్టాన్ని రూపొందించారు.