Nizamabad Crime : నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్ భర్త ప్రత్యర్థిని హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఓ ముఠాకు సుపారి ఇచ్చి తన ప్రత్యర్థిని హత్య చేయాలని పురమాయించాడు. సినిమా తరహాలో మాస్టర్ ప్లాన్ వేశాడు. చివిరికి విషయం తెలుసుకున్న ప్రత్యర్థి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో సుపారీ గ్యాంగ్ ను, సూత్రదారిని పోలీసులు అరెస్టు చేశారు. 


రాజకీయంగా అడ్డువస్తున్నారని... 


నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం లక్కంపల్లి గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్ భర్త మహేంధర్. లక్కంపల్లి గ్రామానికే చెందిన ఉప సర్పంచ్ శ్రీనివాస్, పోలీస్ డిపార్డ్ మెంట్ లో పనిచేస్తున్న ప్రసాద్ రావులను హతమార్చేందుకు మహేంధర్... అక్బర్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చాడు. మొదట రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు అక్బర్. చివరికి 3 లక్షల రూపాయలకు డీల్ కుదిరింది. అక్బర్ కు  20 వేల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చాడు మహేంధర్. అక్బర్ నివాసం ఉంటున్న కాలనీలో విషయం బయటికి పొక్కడంతో ఉప సర్పంచ్ శ్రీనివాస్, ప్రసాదరావులు సీపీ నాగరాజుకు ఈనెల 26న ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మూడ మహేంధర్, అక్బర్ గ్యాంగ్ ను అరెస్టు చేశారు. అక్బర్ నుంచి రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి విచారణ చేపట్టిన అనంతరం అక్బర్ గ్యాంగ్ ను, మహేంధర్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. మహేంధర్ సర్పంచ్ భర్త కావటం అతనికి రాజకీయంగా బడా నేతల అండ ఉండటంతో ఇలా హత్య చేయటానికైనా వెనకాడలేదంటున్నారు బాధితులు. నిందుతులపై 307, 326, 115,120(B)ipc, 25(1)(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 


అసలేం జరిగింది?  


మూడ మహేంధర్ లక్కంపల్లి సర్పంచ్ భర్త. శ్రీనివాస్ మాజీ సర్పంచ్. ప్రస్తుతం శ్రీనివాస్ లక్కంపల్లి ఉప సర్పంచ్ గా ఉన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్ కు చెక్ పవర్ ఉంటుంది. చెక్కులపై సంతకాల విషయంలో ఇరువురి మధ్య పొసగటం లేదు. సర్పంచ్ పలు పనులపై సంతకం పెడితే ఉప సర్పంచ్ పెట్టడం లేదని మూడ మహేంధర్ ఉప సర్పంచ్ శ్రీనివాస్, అలాగే ప్రసాదరావుపై కక్ష పెంచుకున్నాడు. అటు రాజకీయంగా కూడా మూడ మహేంధర్ కు శ్రీనివాస్, ప్రసాదరావులు అడ్డుతగులుతున్నారని భావించాడు. అసలు వీరిని లేకుండా చేస్తే తనకు రాజకీయంగా మరింత ఎదగవచ్చని భావించి వారిని హత్య చేసుందుకు ప్లాన్ వేశాడు. ఇందుకు అక్బర్ అనే సుపారి కిల్లర్ ను ఆశ్రయించాడు మహేంధర్. మొదట 5 లక్షల రూపాయలు ఇస్తే పనిచేస్తానని అక్బర్ అన్నాడు. చివరికి 3 లక్షల రూపాయలకు బేరం కుదిరింది. రూ.20 వేలు అడ్వాన్స్ కూడా అక్బర్ కు ఇచ్చాడు మహేంధర్. శ్రీనివాస్ చేతులు, కాళ్లు విరగొట్టడానికి, ప్రసాద్ రావును హత్య చేయడానికి15 రోజుల క్రితమే డీల్ కుదుర్చుకున్నారని తెలిసింది. అక్బర్ నివసించే కాలనీలో విషయం బయటకు పొక్కింది. అలెర్ట్ అయిన శ్రీనివాస్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు