Jallu Gang Jio Towers : ఉత్తరప్రదేశ్ కు మీరట్ జిల్లాకు  చెందిన జల్లు గ్యాంగ్ అంతరాష్ట్ర దొంగల ముఠాలోని ఓ సభ్యుడిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గత నాలుగు నెలలుగా జియో టవర్లకు చెందిన ఖరీదైన బ్యాటరీలు దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులకు జల్లు గ్యాంగ్ విషయం తెలిసిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు తెలిపారు.  ఈ కేసుని ఛేదించటంలో జక్రాన్ పల్లి ఎస్ఐ, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారని కమిషనర్ నాగరాజు ఉన్నారు. జక్రాన్ పల్లి పీఎస్ పరిధిలోని బాల్నగర్ చౌరస్తా వద్ద సోమవారం రాత్రి 8 గంటల సమయంలో వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో అనుమానస్పదంగా ప్రయాణిస్తున్న ముగ్గురిని జక్రాన్ పల్లి పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని అక్కడే వదిలేసి పొలాల వెంబడి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిలో ఒకరిని, ప్రయాణిస్తున్న కారుని పోలీసులు పట్టుకున్నారు. 



జల్లు గ్యాంగ్ కోసం ఇతర రాష్ట్రాలకు పోలీసులు 


పోలీసుల తనిఖీల్లో ఆ కారులో జియో టవర్ కు చెందిన అయిదు ఖరీదైన బ్యాటరీలు ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల విచారణలో వీళ్లంతా ఉత్తర ప్రదేశ్ మీరట్ కు చెందిన జల్లు గ్యాంగ్ గా తేలింది. వీరు గత నాలుగు నెలలుగా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో జియో టవర్లకు సంబంధించిన ఖరీదైన బ్యాటరీలు దొంగతనాలు చేస్తూ దొరకకుండా తిరుగుతున్నారని విచారణలో బయటపడింది. అయితే పారిపోయిన జల్లు గ్యాంగ్ సభ్యుల గురించి ఉత్తరప్రదేశ్ లోని మీరట్, భేక్రా, మూర్ఖద్ నగర్, ఢిల్లీలోని శీలమూర్ లోని స్క్రాబ్ దందా ప్రాంతాలకు స్పెషల్ పార్టీ సిబ్బందిని పంపించామని కమిషనర్ నాగరాజు తెలిపారు. త్వరలోనే మిగతా గ్యాంగ్ సభ్యులను పట్టుకుంటామన్నారు. 


పారిపోయిన వారి పేర్లు:


1) మహ్మాద్ జయిడ్, వయసు 25


2) మహ్మద్ జాకీర్, వయసు 26 


3) నామ్ అలియాస్ నదీమ్


4) మెహాతాబ్ అలీ, వయసు 35


5) నయీమ్, వయసు 27 


6) వినయ్, వయసు 25 


7) మహ్మద్ రషీద్, వయసు 21 


జల్లు గ్యాంగ్ పై మొత్తం వివిధ పోలీసు స్టేషన్ లలో 12 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 34 బ్యాటరీలు చోరికి గురయ్యాయి. పోలీసులు 33 బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు దాదాపు రూ.25,36,552 ఉంటుంది. అలాగే ఓ కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యం చూపిన పోలీసు సిబ్బంది సీసీఎస్ ఇన్స్పెక్టర్ వై.రాజశేఖర్, ఎస్.ఐ కె.శ్రీకాంత్, కానిస్టేబుల్ రాజేశ్వర్, కానిస్టేబుల్ భూపతికి ఇవాళ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్. నాగరాజు ప్రశంస పత్రాలు, రివార్డులు ఇచ్చి అభినందించారు.