Juvenile Escaped from Juvenile Home: గత కొన్ని రోజులుగా బాలుర నేరాల కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మరోసారి బాల నేరస్తులు పోలీసులను హడలెత్తించే ఘటన జరిగింది. జువైనల్ హోం నుంచి ఐదుగురు బాల నేరస్తులు పారిపోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటన సోమవారం నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. నేర చరిత్ర ఉన్న ఐదుగురు బాలురు నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్ పరిధిలో ఉన్న నాగారం జువైనల్ హోం నుంచి పరారయ్యారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఐదుగురు విద్యార్థులు పారిపోయిన ఘటన వెలుగు చూసింది. 

గోడకు రంద్రం చేసి పరార్.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బాలుర పర్యవేక్షణ గృహం నుంచి ఐదుగురు పారిపోయిన విషయం బయటకు రాకుండా సిబ్బంది ప్రయత్నించారు. కానీ అసలు విషయం బయటకు రావడంతో పోలీసులు, అధికారులు టెన్షన్ పడుతున్నారు. నిజామాబాద్ నగరంలోని నాగారంలో గల బాల బేరస్థుల పర్యవేక్షణ గృహం ఉంది. నేరం చేసిన మైనర్లను ఇక్కడి బాల నేరస్తుల గృహంలో ఉంచుతారు. ఆదివారం రాత్రి జువైనల్ హోం సిబ్బంది పడుకున్న సమయంలో ఐదుగురు బాల నేరస్తులు జువైనల్ హోం బాత్రూమ్ గోడకు రంద్రం చేసుకుని అందులోనుంచి పరారయ్యారు. సోమవారం నాడు సిబ్బంది విషయాన్ని గమనించారు. పరారైన బాలురిలో ఒకరు కొమరం భీమ్ ఆసిఫాబాద్ చెందిన బాలుడు, జగిత్యాలకు చెందిన ఇద్దరు, ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాలకు చెందిన బాలురు ఉన్నట్లు ఎస్సై రాజేశ్వర్ గౌడ్ చెబుతున్నారు.

జువైనల్ హోం పోలీసుల నిర్లక్ష్యం..అసలే వారు బాల నేరస్తులు. తెలిసో తెలియకో నేరాలు చేసి అక్కడికి వచ్చారు. వాటిని సరిగ్గా చూసుకుని ఆ బాలురలో మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత జువైనల్ హోం సిబ్బందిపై ఉంటుంది. కానీ వారు జాగ్రత్తలు తీసుకోకపోగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దాని ఫలితంగా జువైనల్ హోం నుంచి ఐదుగురు బాలురు తప్పించుకున్నారు. రాత్రి డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది పడుకున్నారని గ్రహించిన బాలురు.. ప్లాన్ ప్రకారమే గోడకు రంద్రం చేసి అక్కడి నుంచి బయటపడ్డట్లు తెలుస్తోంది. ఉదయం నిద్ర లేచాక గానీ సిబ్బంది జరిగిన తప్పిదాన్ని గుర్తించలేకపోయారని విమర్శలు వస్తున్నాయి.

కాగా, గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఆ సమయంలో ఒకరిద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సిబ్బందిని మార్చినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు అదే నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో బాలురు తప్పించుకోవడం లాంటివి రిపీట్ అవుతున్నాయి. తప్పించుకున్న బాలుర ఆచూకీ ఇంకా తెలియరాలేదు. పోలీసులు బాలుర ఇళ్లు, గ్రామాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వారి ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. అయితే ఒక్కసారిగా 5 గురు బాల నేరస్థులు పారిపోవడం కలకలం రేపుతోంది. ఉన్నతాధికారులు జువైనల్ హోం సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

Also Read: Vikarabad News : 48 గంటల అల్టిమేటం పెట్టిన బీఎస్పీ నేత ఆచూకీ లభ్యం, ఎక్కడున్నారంటే?

Also Read: Uttarakhand Gang Rape : కదిలే కారులో ఆరేళ్ల బాలికపై అత్యాచారం - ఉత్తరాఖండ్‌లో మరో నిర్భయ !