Southwest Monsoon: నైరుతి రుతుపవనాల ప్రభావంతో సోమవారం ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అల్పపీడన ద్రోణి ఉత్తర భారత ద్వీపకల్ప 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి గాలులకోత సగటు సుమద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నేడు సైతం ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుల సూచన ఉంది. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీ, తెలంగాణలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఆకాశం మేఘావృతమై ఉంది. ఏపీలో నేటి నుంచి రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో పాటు యానాంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు అధికంగా ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అన్ని జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు, అంతకన్నా తక్కువగా నమోదవుతున్నాయి. ఒకట్రెండు చోట్ల 36, 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 





దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లులు కురుస్తాయి. కొన్ని చోట్ల మాత్రం ఓ మోస్తరు వర్ష సూచన ఉంది. కృష్ణా జిల్లా, నంద్యాల జిల్లా, కర్నూలు నగరం, కర్నూలు - తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని జిల్లాల్లో నేటికి వర్షాలు మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు ఎప్పుడు మొదలుపెట్టాలే అర్థం కాని పరిస్థితి ఆ జిల్లాల రైతుల్లో నెలకొంది.


హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.





తెలంగాణలో వర్షాలు
రాష్ట్రంలో నేడు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 3 గంటల్లో వర్షాలు కురుస్తాయని నారాయణపేట, వికారబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగామ, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


Also Read: Gold-Silver Price: నేడు బంగారం ధర షాక్! వెండి కూడా అంతే; నేడు ధరలు ఎలా ఉన్నాయంటే


Also Read: Karimnagar Cat Rescue : అర్థరాత్రి "పిల్లి" ప్రాణం కాపాడిన కరీంనగర్ పోలీసులు - ఈ రెస్క్యూ ఆపరేషన్ హైలెట్