Nizamabad News : క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంది ఓ బాలిక. కేవలం సెల్ ఫోన్ కోసం బాలిక ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో చోటుచేసుకుంది. శివాని అనే విద్యార్థిని టెన్త్ క్లాస్ చదువుతోంది. కొన్ని రోజులుగా తల్లిదండ్రులను సెల్ ఫోన్ కొనివ్వాలని ఒత్తిడి చేసింది. తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనివ్వకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఆత్మ హత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అంబేడ్కర్ విగ్రహం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం కలకలం రేపింది. హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ గ్రామానికి చెందిన మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి లావుడ్య పాండు అంబేడ్కర్ విగ్రహం ఎక్కే మెట్లకు ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు ఉరి వేసుకోవడాన్ని అడ్డుకున్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితుడు పాండును 108కు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం లేని వ్యక్తి పాండు నిత్యం అంబేడ్కర్ చౌరస్తాలో తిరుగుతూ అంబేడ్కర్ విగ్రహాన్ని శుభ్రం చేస్తూ ఉంటాడని స్థానికులు చెబుతున్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
జేఎన్టీయూ క్యాంపస్ లో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఓ ఉత్తమ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. క్లాస్ రూం కాంప్లెక్స్ భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమె ఇంటర్నల్ పరీక్ష రాసి భోజనం చేసి.. మరో పరీక్ష రాసేలోపే ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అసలేం జరిగిందంటే..?
ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కొడవలూరుకు చెందిన ఇసానక మనోజ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. భార్య, 21 ఏళ్ల కుమార్తె మేఘనారెడ్డితో కలిసి కూకట్ పల్లి వివేకానంద్ నగర్ లో నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం ఇంటర్నల్ పరీక్ష రాసిన మేఘన మధ్యాహ్నం 2 గంటలకు చివరి ఏడాది సెమిస్టర్ పరీక్ష రాయాల్సి ఉంది. దానికి పావు గంట ముందు 1.45 గంటల ప్రాంతంలో క్యాంపస్ మైదానం పక్కన నాలుగు అంతస్తుల భవనం పైకి వెళ్లి దూకేసింది. ఆమెను వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3.36 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయింది. తోటి విద్యార్థులు, అధ్యాపకులు కన్నీరుమున్నీరయ్యారు. సీఎస్ఈ హెడ్ వసుమతి.. ఉత్తమ విద్యార్థి మృతితో బోరుమని విలపించారు. ఒత్తిడితోనే మేఘన ఆత్మహత్య చేసుకొని ఉండచ్చని ఎస్ హెచ్ఓ కిషన్ కుమార్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మేఘన ఎంసెట్ లో 200 ర్యాంకు సాధించింది. ఏడాది కాలంగా ఆమె మానసిక చికిత్స తీసుకుంటుందని వైస్ ప్రిన్సిపల్ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. 6 నెలలుగా కుమార్తెను తల్లి కారులో తీసుకొచ్చి దింపి.. తరగతులు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తిరిగి తీసుకెళ్లేదని విద్యార్థులు తెలిపారు. బుధవారం 1.40 వరకు కుమార్తెతోనే ఉండి అన్నం తినిపించిన తల్లి పరీక్ష బాగా రాసి రా అని చెప్పి అటు వెళ్లగానే మొదటి సంవత్సరం తరగతులు జరిగే భవనం పైకి వెళ్లి దూకేసింది. తరగతిలోనూ మేఘన ముభావంగా ఉండేదని, తనకు ఐఐటీలో చదవాలని ఉండేదని ఎప్పుడూ ఆమె చెబుతుండేదని సహచన విద్యార్థులు తెలిపారు.