నిజామాబాద్ జిల్లాలో అతి కిరాతకమైన ఘటన జరిగింది. జిల్లాలోని మాక్లూర్ మండలం రామచంద్ర పల్లి గ్రామ శివారులో దొడ్డిండ్ల పోశెట్టి అనే 40 ఏళ్ల వ్యక్తిని ఉరి వేసి అతికిరాతకంగా దహనం చేశారు. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అతణ్ని వెంటాడి దాడి చేసి, హత్య చేసి చెట్టుకు ఉరి పోసి నిప్పు పెట్టారని చెబుతున్నారు. ఈ ఘటన రామచంద్ర పల్లి గ్రామంలో కలకలం రేపింది. మృతుడు వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. పోలీసులు సమాచారం అందుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.


పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్ర పల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారి 63 పక్కన దొడ్డిండ్ల పోశెట్టి (40) పై గుర్తు తెలియని దుండగులు వెంటాడి దాడి చేసి హత్య చేసిన అనంతరం చెట్టుకు ఊరి పోసి మరి నిప్పు పెట్టారు. ఈ ఘటన రామచంద్రాపల్లి గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేపింది. మృతుడు వ్యవసాయ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతునికి ఇద్దరు కుమారులు భార్య ఉన్నారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే పోశెట్టిని ఈ విధంగా అతికిరాతంగా దాడి చేసిన కారకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 


అయితే, ఇతనికి ఆర్థిక పరమైన లావాదేవీలకు సంబంధించి తగాదాలు ఉన్నాయని, ఈ రోజు భూ వివాదంలో ఉన్న కేసు విషయంలో కోర్టుకు హాజరు కావాల్సి ఉందని మృతుని కుమారుడు తెలిపాడు. తన తండ్రిని చంపిన వారిని శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. సంఘటన స్థలాన్ని నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వర్, సీఐ నరేష్, ఎస్ ఐ యాదగిరి గౌడ్ లు పరిశీలించారు. కుటుంబ సభ్యులు నలుగురు అనుమానితులపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. క్లూస్ టీమ్ వచ్చిన అనంతరం మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తామని ఆయన చెప్పారు.


జుగుప్సాకర స్థితిలో చెట్టుకు వేలాడుతున్న మృత దేహం
గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. బుధవారం అటువైపుగా వెళ్లిన వారు ఈ ఘటన చూసి ఒక్కసారిగా హతాశయులయ్యారు. వెంటనే ఊళ్లోవారిని పిలుచుకొని రాగా, పోశెట్టి మృత దేహం చెట్టుకు ఉరి వేసి వేలాడుతూ కనిపించింది. అంతేకాక, ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు నిందితులు శవాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశారు. సగం కాలిన శవం బిగుసుకుపోయి చెట్టుకు వేలాడుతుండడం కుటుంబ సభ్యుల్ని, గ్రామస్థుల్ని కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని నిందితులు కోరుతున్నారు.