టెక్నాలజీ అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో సైబర్ నేరగాళ్ల మోసాలు అధికం అవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే వందల సంఖ్యలో సైబర్ మోసగాళ్ల వలలో చిక్కి లక్షల్లో డబ్బులు నష్టపోతున్న వారు ఎందరో ఉన్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామానికి చెందిన వడ్ల సత్యం అనే యువకుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి రూ. 68,187 అకౌంట్ నుంచి కోల్పోయాడు. ఎలా జరిగిందంటే లక్కీ డ్రాలో పాల్గొనాలని ఓ లింక్ వచ్చినట్లు యువకుడు తెలిపాడు. లింక్ ఓపెన్ చేయగానే యువకుడి అకౌంట్ నుంచి నిమిషాల వ్యవధిలో డబ్బులు మాయమయ్యాయి. మోసపోయాయానని గ్రహించిన యువకుడు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. 


ఉమ్మడి జిల్లాలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు 
టెక్నాలజీ పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి రావడంతో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. చదువుకున్న వారు మస్ట్ గా సెల్ ఫోన్ వాడకతప్పని పరిస్థితి అన్నట్లు తయారైంది. దీంతో ఫోన్ లోనే బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు ఉంటున్నాయి. ఫోన్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోయాయి. సెల్ ఫోన్ పై కొంత అవగాహన ఉన్న వారంతా ఆన్ లైన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇదే అదునుగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు దోపిడీలకు పాల్పడుతున్నారు. ఏ ఇబ్బంది లేకుండా తెలివిగా తాము ఉన్న చోటు నుంచే ఇతరుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. కొత్త కొత్త ఐడియాలతో అమాయకులను బురిడి కొట్టించి లక్షల్లో రూపాయలను కొళ్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు.


కామారెడ్డిలోనే గతంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి రూ. 4 లక్షలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోయారు. ఇలా ఉమ్మడి జిల్లాలో చాలా మంది సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోతున్నారు. కొందరు ధైర్యంగా వచ్చి పోలీస్ లకు ఫిర్యాదు చేస్తున్నారు. మరికొందరు పరువు పోతుందని తమ బాధను చెప్పుకోలేక పోతున్నారు. ఆఫర్లు, లక్కీ డ్రా పేరుతో లింకులు పంపుతున్నారు. వాటినికి క్లిక్ చేయగానే అకౌంట్లలో ఉన్న డబ్బులు మాయమవుతున్నాయి. నిజామాబాద్ నగరంలో ఓ పేరొందిన ప్రైవేట్ స్కూల్ లో చదివే పిల్లల పేరెంట్స్ కాల్ లిస్ట్ సేకరించిన సైబర్ నేరగాళ్లు.. ఎక్స్ ట్రా మార్క్స్ క్లాస్ లు అంటూ పిల్లల పేరేంట్స్ కు లింకులు పంపి బురిడి కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. పేరెంట్స్ ఫిర్యాదులతో మేల్కొన్న స్కూల్ యాజమాన్యం 4వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇలా వివిధ ఐడియాలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపొతున్నారు. 


అప్రమత్తతే ముఖ్యం, 1931కు కాల్ చేయండి 
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏదైనా సైబర్ మోసగాళ్ల బారిన డబ్బులు మోసపోతే వేెంటనే 1931 నెంబర్ కు కాల్ చేయాలి. ఈ నెంబర్ కు కాల్ చేస్తే సైబర్ క్రైం పోలీసులు  వివరాలు తీసుకుని డబ్బులు రికవరీ చేసే ప్రయత్నం చేస్తారు. అది కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి అకౌంట్లో నుంచి డబ్బులు పోయాయని తెలిసిన వెంటనే 1931 నెంబర్ కు కాల్ చేస్తేనే నగదు రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసర కాల్స్ కి యూపిఐ, బ్యాంక్ ఖాతాల వివరాలు చెప్పకూడదు. వాట్సాప్ లో గానీ.. ఇతర వాటికి వచ్చే లింక్స్, ఫేక్ లింక్స్ ను అస్సలు ఓపెన్ చేయకూడదు.