NCLAT - Google: నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (NCLAT), వారం వ్యవధిలోనే, గూగుల్‌ రెండో చెంపను కూడా వాయించింది. ప్లే స్టోర్‌ (Play Store) విధానాలకు సంబంధించి, తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు ఈ టెక్ దిగ్గజం మీద కాంపిటీషన్‌ కమిషన్ ఆఫ్‌ ఇండియా (Competition Commission of India - CCI) విధించిన జరిమానా నిలుపుదలకు నిరాకరించింది.


కంపెనీల మధ్య ఆరోగ్యకర పోటీ ఉండేలా చూసే 'పోటీ వాచ్‌డాగ్' CCI విధించిన రూ. 936.44 కోట్ల పెనాల్టీ మీద స్టే ఇవ్వాలని కోరుతూ, నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను గూగుల్‌ ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ మీద బుధవారం (జనవరి 11, 2023) విచారణ జరిగింది. గూగుల్‌కు మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి NCLAT నిరాకరించింది. జరిమానా మొత్తంలో (రూ. 936.44 కోట్లు) 10 శాతం సొమ్మును ‍‌(రూ. 93.64 కోట్లు) మరో నాలుగు వారాల్లో తమ రిజిస్ట్రీ వద్ద డిపాజిట్‌ చేయాలని కూడా ఆదేశించింది.


జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్‌ అలోక్ శ్రీవాస్తవతో కూడిన ద్విసభ్య ధర్మాసనం, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది.


గూగుల్‌ అభ్యర్థనను NCLAT తిరస్కరించడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం విశేషం.


రెండు దఫాలుగా జరిమానా
ప్లే స్టోర్‌ యాప్స్‌కు సంబంధించి, తన గుత్తాధిపత్యాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేస్తుండటంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు గతంలో ఫిర్యాదులు అందాయి. దర్యాప్తు చేపట్టిన సీసీఐ, 2022 అక్టోబర్ 25వ తేదీన గూగుల్‌కు రూ. 936.44 కోట్ల జరిమానా విధించింది. థర్డ్‌ పార్టీ బిల్లింగ్‌ లేదా యాప్‌ల కొనుగోలుకు పేమెంట్‌ సర్వీసులను ఉపయోగించుకోకుండా యాప్‌ డెవలపర్స్‌ను అడ్డుకోవద్దని కూడా CCI ఆదేశించింది. ఈ ఆదేశం నిలుపుదల కోసమే గూగుల్‌ కంపెనీ NCLATని ఆశ్రయించింది.


అంతకుముందు కూడా ఇదే తరహాలో గూగుల్‌కు CCI రూ. 1,337.76 కోట్ల పెనాల్టీని విధించింది. తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధిపత్య స్థానాన్ని అనేక మార్కెట్లలో గూగుల్‌ దుర్వినియోగం చేసిందన్న ఆరోపణల మీద విచారణ చేసిన CCI, 2022 అక్టోబర్ 20న ఆ కంపెనీకి రూ. 1,337.76 కోట్ల భారీ జరిమానా విధించింది. ఆండ్రాయిడ్‌ ఫోన్లలోని యాప్‌లను అన్‌ ఇన్‌స్టాల్‌ చేసి, తమకు ఇష్టమైన సెర్చ్‌ ఇంజిన్‌ను ఎంచుకునేందుకు వినియోగదార్లకు గూగుల్‌ వీలు కల్పించాలని ఆదేశించింది. అనైతికమైన, అన్యాయమైన వాణిజ్య విధానాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ జరిమానా మీద కూడా స్టే తెచ్చుకునేందుకు గత వారం NCLATని గూగుల్‌ ఆశ్రయించింది. స్టే ఇచ్చేందుకు NCLAT నిరాకరించింది.


ఆండ్రాయిడ్‌ మొబైళ్ల విభాగంలో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నందునందకుగాను CCI విధించిన రెండు జరిమానాలు ( 1,337.76 కోట్లు +  936.44 కోట్లు) కలిసి జరిమానాకు ఇది అదనం. మొత్తం రూ. 2,274 కోట్ల జరిమానాను ఇప్పుడు గూగుల్‌ చెల్లించాల్సి ఉంది.