Economic Crisis in Pakistan: మన పొరుగు దేశం శ్రీలంక (Sri Lanka) పరిస్థితి 2022 సంవత్సరంలో చాలా దారుణంగా మారింది. ఆ దేశంలో దరిద్ర దేవత తాండవిస్తోంది. విదేశీ రుణాలు చెల్లించలేక, ఎగవేతదారుగా ముద్ర వేయించుకుంది. ఇప్పుడు దాదాపు ఇదే పరిస్థితి పాకిస్థాన్‌లోనూ కనిపిస్తోంది. పాకిస్థాన్ మరో శ్రీలంకలా మారింది. దాయాది దేశంలో నిత్యావసర వస్తువుల కొరత అతి తీవ్రంగా ఉంది.
పాకిస్థాన్‌లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Foreign Exchange Reserves - Forex) రోజురోజుకు తగ్గిపోతున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ సమాచారం ప్రకారం... ఆ దేశ విదేశీ మారక నిల్వలు 8 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి, సుమారు 5.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఈ మొత్తంతో, పాకిస్తాన్ కేవలం 3 వారాలకు అవసరమైన వస్తువులను మాత్రమే దిగుమతి చేసుకోగలుగుతుంది.
తీవ్ర ఆర్థిక సంక్షోభం
పాకిస్థాన్ విదేశీ రుణాలు నిరంతరం పెరుగుతుండగా, విదేశీ మారక ద్రవ్యం ఎప్పటికప్పుడు క్షీణిస్తోంది. పాకిస్తాన్ ప్రధాన వార్తాపత్రిక డాన్ నివేదిక ప్రకారం... మార్చి 2022 నాటికి, దేశం నెత్తి మీద ఉన్న మొత్తం విదేశీ అప్పు 43 లక్షల కోట్ల పాకిస్తాన్ రూపాయలకు చేరుకుంది. ఈ అప్పులో ఎక్కువ భాగం ఇమ్రాన్ ఖాన్ హయాంలోనిది. అతను కేవలం 3 సంవత్సరాలలో మొత్తం 1400 వేల కోట్ల పాకిస్థానీ రూపాయల రుణం తీసుకున్నాడు. దీంతో దేశంలో విదేశీ మారకద్రవ్యం దాదాపు ముగింపు దశకు చేరుకుంది.
మీడియా నివేదికల ప్రకారం... స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ వద్ద 2022 జనవరిలో (సరిగ్గా ఏడాది క్రితం) మొత్తం 16.6 బిలియన్ డాలర్లు ఉంటే, ఇప్పుడు ఆ నిల్వ 5.6 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఒక్క ఏడాదిలోనే ఆ బ్యాంక్ దగ్గర నిల్వలు సుమారు 11 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. ఈ క్షీణత వెనుకున్న అతి పెద్ద కారణం విదేశీ రుణాల వాయిదాలు చెల్లించడం.
ఉరుముతున్న ద్రవ్యోల్బణం
మరోవైపు.. పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం అతి తీవ్రంగా పెరుగుతోంది. పెరిగిన ధరల వల్ల ఆహారాన్ని కొనుక్కునేంత స్థోమత లేక మధ్య తరగతి ఆదాయ వర్గాలు కూడా ఆర్థాకలితో రోజులు వెళ్లదీస్తున్నాయి. ఇక, పిడికెడు మెతుకుల కోసం పేదలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం సబ్సిడీలో అందిస్తున్న గోధుమ పిండి కోసం వేలాది ప్రజలు గంటల కొద్దీ ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, సింధ్, బలూచిస్థాన్ వంటి ప్రాంతాల్లో గోధమ పిండి కోసం ప్రజలు ఎగబడుతుండడంతో తొక్కిసలాటలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నాయి. చాలా ప్రాంతాల్లో సాయుధ బలగాల పహారాలో ఆహార పదార్థాలను పంపిణీ చేసే పరిస్థితి నెలకొంది. తోపులాటలను నివారించడానికి, కొన్ని ప్రాంతాల్లో గాలిలోకి కాల్పులు కూడా జరుపుతున్నారు.
ఈ పరిస్థితిని రాబందుల్లాంటి వ్యాపారులు సానుకూలంగా మార్చుకుంటున్నారు, శవాల మీద పేలాలు ఏరుకు తింటున్నారు. సరిగ్గా ఏడాది క్రితం, 2022 జనవరిలో రూ. 37గా ఉన్న కేజీ ఉల్లిపాయల రేటు ఇప్పుడు ఏకంగా రూ. 220కి చేరింది. డజను అరటి పళ్లు 119 రూపాయల ధర పలుకుతున్నాయి. కిలో చికెన్ 384 రూపాయలు, లీటరు పాలు 150 రూపాయలు.. ఇలా ప్రతి వస్తువు ధరకు రెక్కలు వచ్చాయి. పెట్రోల్ ధరలు 48 శాతం, డీజిల్ ధరలు 61 శాతం పెరిగాయి. ఈ రేట్ల దగ్గర కొనలేక సంపన్నులు కూడా పాకిస్థాన్ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం "తీవ్రమైన" పరిస్థితిలో ఉంది. ఆ దేశాన్ని పాలిస్తున్న షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం, ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధితో (IMF) చర్చలు జరుపుతోంది. IMF ప్యాకేజీలోని తదుపరి విడతను వీలైనంత త్వరగా పొందడానికి ప్రయత్నిస్తోంది.