భార్య మరొకరితో తన శారీరక సుఖం చూసుకోవడం ఆ కుటుంబంలో కోలుకోలేని దెబ్బ తీసింది. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. చివరికి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నా చేరదీసే వారు లేక పిల్లలు దిక్కులేని వారయ్యారు. నిర్మల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె పెట్టుకున్న వివాహేతర బంధం భర్తతో పాటు ఓ చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది. స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..


నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం బోరిగాం గ్రామానికి చెందిన కుదురు పోతన్న అనే 34 ఏళ్ల వ్యక్తికి 11 సంవత్సరాల క్రితం భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన దగ్గరి బంధువు పూజితతో పెళ్లయింది. వీరికి ఓ కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరి జీవనాధారం.. గొర్రెలు కాయడం కావడంతో పోతన్న అదే పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే, పూజిత కొంతకాలంగా సొంతూరికే చెందిన శ్రీకాంత్‌ రెడ్డి అనే వ్యక్తితో రహస్యంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో పంచాయితీ పెట్టి ఇద్దరు దూరంగా ఉండాలని పెద్దలు హెచ్చరించారు. మళ్లీ ఇద్దరూ తమ అక్రమ బంధాన్ని అలాగే కొనసాగిస్తుండడంతో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగాయి. దీంతో ఈ నెల 22న భార్య పూజిత తన చిన్నకూతురైన మూడేళ్ల క్యూటీని తీసుకుని ప్రియుడు శ్రీకాంత్‌ రెడ్డితో వెళ్లిపోయింది. 


మూడు రోజులపాటు వారు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో ఉన్నట్లు సమాచారం. అనంతరం ఈ నెల 25న ప్రియుడు శ్రీకాంత్‌ రెడ్డి ఆమెను, పాపను నిర్మల్‌ బస్టాండ్‌లో వదిలేసి సొంతూరికి వెళ్లిపోయాడు. ఇంటికి ఫోన్‌ చేస్తే, ఆమె వెళ్లిన రోజు సాయంత్రమే అవమానంతో పోతన్న కూడా ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్లిపోయాడని తెలిసింది. దీంతో దిక్కుతోచని ఆమె బుధవారం రాత్రి నిర్మల్‌ బస్టాండ్‌‌లోనే తన కూతురికి పురుగుల మందు తాగించి తానూ సేవించింది. వెంటనే స్థానికులు వారిని ఆస్పత్రిలో చేర్చగా.. చిన్నారి క్యూటీ చనిపోయిందని తేల్చారు. పూజిత పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెకు ఐసీయూలో చికిత్స అందించారు. చివరకు ఆమె కోలుకుంది.


పోలీసులు విచారణ చేయగా.. శ్రీకాంత్‌ రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేశాడని చెప్పింది. మూడు రోజులు తన వెంట ఉంచుకొని నిర్మల్‌ బస్టాండ్‌లో నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోయాడని పూజిత తెలిపింది. ఇంట్లో కుటుంబ సభ్యులను ఎదుర్కొనలేక మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పింది.


భర్త కూడా ఆత్మహత్య
మరోవైపు, భార్య మరో వ్యక్తితో వెళ్లిపోవడంతో పోతన్న జీర్ణించుకోలేకపోయాడు. అవమాన భారంతో 22వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గాలించగా.. సారంగపూర్‌ మండలం ఆలూరు చెరువు వద్ద పోతన్న బండి, వస్తువులు కనిపించాయి. చెరువు మొత్తం గాలించగా.. చాలా సేపటికి అతని శవం బయటపడింది. 


పోలీసులు మాట్లాడుతూ.. శ్రీకాంత్‌రెడ్డి, పూజితలపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం శ్రీకాంత్‌ రెడ్డి పరారీలో ఉన్నాడని నిర్మల్‌ పోలీసులు తెలిపారు. మరోవైపు, భార్య పూజిత ప్రాణాలతో బయటపడ్డా.. ఆమె తల్లిదండ్రులు కానీ, అత్తగారింట్లోనూ ఆమెను, ఆమె పిల్లలను దూరం పెడుతున్నారు. ఇద్దరు పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందరి స్థానికులు తెలిపారు.