Hyderabad kidnap case: పనిమనిషిగా ఇంట్లో చేరింది. రెండు రోజులకే 9 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లింది. తల్లిదండ్రులు గమనించి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు... సీసీ ఫుటేజ్ ఆధారంగా... కొన్ని గంటల్లోనే కేసును ఛేదించారు. జహీరాబాద్‌లో నిందితురాలని పట్టుకున్నారు. చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారి దొరకడంతో అటు పేరంట్స్, ఇటు పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కాస్త ఆలస్యమయితే... నిందితురాలు... తప్పించుకునేది అంటున్నారు పోలీసులు.
అసలు ఏం జరిగిందంటే..?
హైదరాబాద్(Hyderabad) పాతబస్తీ (Old city)లోని మాదన్నపేటలో జరిగిందీ కిడ్నాప్. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన షహనాజ్‌ఖాన్ అనే మహిళ... చిన్నారి ఇంట్లో రెండు రోజుల క్రితమే పనికి కుదిరింది. చిన్నారి ఆరోగ్యం సరిగాలేకపోవడంతో... చంచల్‌గూడలోని నర్సింగ్‌హోమ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలోనే... చిన్నారి కిడ్నాప్ అయ్యింది. ఇంట్లో పని ముగించుకుని... ఆస్పత్రికి వచ్చిన షహనాజ్‌ఖాన్ ఎవరికీ తెలియకుండా పాపను ఎత్తుకెళ్లింది. చిన్నారి కనిపించకపోవడంతో... వెంటనే పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు. సమీపంలోని సీసీ కెమరాలను పరిశీలించిన పోలీసులు... షహనాజ్‌ఖాన్ పాపను కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. ఆమె అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్లిందని.. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ (MGBS)లో జహీరాబాద్ (zaheerabad) బస్సు ఎక్కినట్టు గుర్తించారు. వెంటనే జహీరాబాద్ పోలీసులను అప్రమ్తతం చేశారు... మాదన్నపేట పోలీసులు. జహీరాబాద్ పోలీసులు వెంటనే... బస్టాండ్ దగ్గరకు చేరుకుని వేచి చూశారు. షహనాజ్‌ఖాన్ ఎక్కిన బస్సు కోసం ఎదురుచూశారు. ఆ బస్సు రాగానే అప్రమత్తమయ్యారు. చిన్నారితోపాటు బస్సు దిగిన షహనాజ్‌ఖాన్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల్లోనే కేసును ఛేదించారు పోలీసులు. చిన్నారిని సేఫ్‌గా పేరంట్స్‌కు అప్పగించారు. నిందితురాలు షహనాజ్‌ఖాన్... ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళగా గుర్తించారు. అయితే... ఆమె చిన్నారిని ఎందుకు కిడ్నాప్ చేసింది...? ఎక్కడికి తీసుకెళ్లాలని అనుకుంది...? ఆమె వెనుక కిడ్నాప్ ముఠా ఉందా..? అన్న కోణంలో విచారణ జరపనున్నారు పోలీసులు.
చిన్నారి క్షేమంగా తమ చెంతకు చేరడంతో తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. పాప కిడ్నాప్ అయినట్టు వెంటనే గుర్తించడం... త్వరత్వరగా దర్యాప్తు జరగడంతో నిందితురాలిని పట్టుకోగలిగారు పోలీసులు. లేదంటే.. పరిస్థితి ఏంటి..? అన్నది ఆందోళనకరమే. ఇటీవల నిజామాబాద్‌లోనూ బెగ్గింగ్ ముఠా ఆగడాలు బయటపడ్డాయి. చిన్నారులను కిడ్నాప్ చేసి... వారిని చిత్రహింసలు పెట్టి దివ్యాంగులుగా మారుస్తున్న ఘటన వెలుగుచూసింది. పిల్లలను దివ్యాంగులుగా మార్చి.. వారితో బెగ్గింగ్ చేయిస్తోంది ఈ ముఠా. ఈ మధ్య కాలంలో పిల్లల కిడ్నాప్‌లు ఎక్కువవుతున్నాయని... చిన్న పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
మాదన్నపేట (Madhannapet) కిడ్నాప్ కేసులో... నిందితులరాలు షహనాజ్‌ఖాన్‌ను అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళ ఏ ఉద్దేశంలో ఇంట్లో పనిమనిషిగా చేరింది. కిడ్నాప్ చేయాలనే ప్లాన్‌తోనే ఇంట్లో పనికి చేరిందా? అని కూడా ఆరా తీయనున్నారు పోలీసులు. లేదంటే... కిడ్నాప్ వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా..? ఉంటే అవేంటి...? అంటూ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.