Stretching Exercise : ఈ రోజుల్లో వెన్నునొప్పి అనేది సాధారణ సమస్యగా మారింది. ఇది రావడానికి వివిధ కారణాలు ఉన్నాయి. వ్యాయామం లేకపోవడం, ఆఫీస్‌లో కూర్చోని చేసే ఉద్యోగాలు, పేలవమైన భంగిమ తీవ్రమైన వెన్నునొప్పికి కారణమవుతాయి. దీనికి చికిత్స చేయించుకోకపోతే అనేక సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా మీ భంగిమను పూర్తిగా ప్రభావితం చేస్తుంది. ఈ సమస్య ఉంటే కూర్చోవడం, పడుకోవడం, నడవడం, వంగడం వంటి రోజువారీ పనులు చేయడం కూడా కష్టతరం అవుతుంది.
వెన్నునొప్పి తీవ్రం కాకుండా ఉండాలంటే.. దానికి వెంటనే చికిత్స చేయించుకోవాలి. నొప్పి రావడానికి గల కారణాలను గుర్తించి.. సమస్యను తగ్గించుకోవచ్చు. కొందరు ఈ సమస్యను దూరం చేసుకోవడానికి ఆస్టియో ప్రెజర్‌ను ట్రీట్మెంట్స్ కూడా ఫాలో అవుతున్నారు. దీని ప్రకారం నిర్దిష్టమైన పాయింట్లు నొక్కినప్పుడు లేదా ప్రత్యేకమైన స్ట్రెచ్ చేసినప్పుడు ఈ సమస్య తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో మందులు వాడాల్సిన అవసరం కానీ.. శస్త్రచికిత్స్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కొన్ని వ్యాయామాలతో కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ వ్యాయామాలు ఏమిటో.. వాటిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
థొరాసిక్ స్ట్రెచ్
ఫోమ్ రోలర్ తీసుకోండి. అనంతరం నేలపై కూర్చోండి. ఫోమ్ రోలర్‌ను వెనుక భాగంలో ఉంచి.. దానిపై పడుకోండి. మెల్లిగా కాళ్లను చాచి.. మెడ, తల నేలపై ఉండేలా చూసుకోండి. ఫోమ్ రోలర్ కరెక్ట్‌గా ఉందో లేదో మరోసారి చెక్ చేసుకోండి. అది కరెక్ట్‌గా ఉంటే మీకు కాస్త నొప్పి ఉంటుంది. ఇప్పుడు డీప్ బ్రీత్ తీసుకోండి. ఇప్పుడు శరీర పైభాగాన్ని కొద్దిగా ముందుకు వెనుకకు తరలించండి. ఈ స్ట్రెచ్ రెండు నిమిషాలు చేయవచ్చు. ఇది మీ వెనుక కండరాలను సాగదీసి.. నొప్పిని తగ్గిస్తుంది.
ఓపెనింగ్ చెస్ట్
రెండు కుర్చీలను మీకు రెండువైపులా.. చేతులు అందుకోగలిగేంత దూరంలో ఉంచండి. వాటి మధ్య మోకాళ్లు వేసి కూర్చోండి. ఇప్పుడు మీ రెండు చేతులను విస్తరించి.. 90 డిగ్రీల కోణంలో ఉండేలా కూర్చీలపై చేతులు ఉంచండి. ఈ చేతులను కాస్త పైకి లేపి.. పది డిగ్రీలు ముందుకు వంగండి. ఊపిరి పీల్చుకుంటూ కిందకి వంగాలి. యథాస్థానంలోకి వచ్చేప్పుడు ఊపిరి వదలాలి. ఇలా చేస్తే ఛాతీలో ఉండే నొప్పి తగ్గుతుంది. రెండు నిమిషాలు ఈ వ్యాయామం చేయడం వల్ల పెక్టోరల్ కండరాలు విస్తరిస్తాయి. ఈ వ్యాయామాన్ని మీరు నిల్చోని కూడా చేయవచ్చు. రూమ్ కార్నర్‌కి వెళ్లి చేతులను గోడకు ఆనించి.. ఇదే తరహాలో వ్యాయామం చేయాలి.
డయా ఫ్రాగమ్ స్ట్రెచ్
ఓ కూర్చీపై నిటారుగా కూర్చోండి. డీప్ బ్రీత్ తీసుకుని వదలండి. ఈ సమయంలో మీరు ఎగువ శరీరం ముందుకు వంగండాన్ని మీరు గమనించవచ్చు. మరోసారి గాలిని తీసుకుని.. వీలైనంత గట్టిగా దానిని వదలండి. ఊపిరితిత్తుల్లోని గాలి మొత్తాన్ని బలవంతంగా బయటకు వదలండి. ఇప్పుడు మీ శరీరాన్ని మీ కాళ్ల మధ్య తీసుకెళ్లండి. ఇప్పుడు నోటిని, ముక్కును మూసేయండి. ఇవి మీ శరీరాన్ని వెనుకకు తీసుకురండి. మీ ఊపిరితిత్తులలో ఆక్సిజన్ లేదనే ఫీలింగ్ వచ్చే వరకు శ్వాస తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఇప్పుడు మెల్లిగా గాలితీసుకోండి. దీనిని మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా పర్లేదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల వెన్నునొప్పి దూరం కావడంతో పాటు.. ఊపిరితిత్తులు కూడా హెల్తీగా మారుతాయి.
ఈ వ్యాయామాలు మీకు ప్రస్తుతమున్న నొప్పిని దూరం చేయడమే కాకుండా.. భవిష్యత్తులో మరోసారి అసౌకర్యానికి గురికాకుండా చేస్తాయి. కాబట్టి వీటిని మీ రెగ్యూలర్ రోటీన్లో భాగం చేయండి.
Also Read : బెల్లీఫ్యాట్‌ని కరిగించే కశ్మీరీ టీ.. ఈ రెసిపీలో ఉపయోగించే పదార్థాలు ఏవంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.