Stock market trading Scam: ఒకప్పుడు దొంగతనం అంటే ఇంట్లోకి చొరబడటమో.. బ్యాంకుల దగ్గర కాపలా కాసి లాక్కుపోవడమో.. లేకపోతే జేబులు కొట్టడమో చేసేవారు. కానీ ఇప్పుడు కాలంతో పాటు దొంగతనాల స్టైల్ మారిపోయింది. మన అకౌంట్లో ఉన్నవాటిని మనకు తెలియకుండా దోచేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మాయమాటలు చెప్పి మన చేతుల మీదుగానే దోచేస్తున్నారు. ఆన్ లైన్ మోసాల్లో కొత్తగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స్కామ్ ఒకటి. ఇప్పుడు ఈ స్కామ్‌లో బాధితులయ్యే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.
హఠాత్తుగా మన వాట్సాప్ లో ఓ కొత్త గ్రూపులో మనల్ని యాడ్ చేస్తారు. దానికి ఏదో ఆకర్షణీయ పేరు ఉంటుంది. స్టాక్ మార్కెట్ కిటుకులు చెబుతామని ఉచిత సర్వీసని చెబుతారు. ఏ ఆసక్తి లేని వారు అయితే డిలీట్ చేస్తారు.కానీ ఇప్పుడు ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఫ్రాడ్ స్టర్లు ఈ మార్గం ఎంచుకున్నారు. ఎవరు ఏ చిన్న ఆసక్తి వ్యక్తం చేసినా వారిని ట్రాప్ లోకి లాగేస్తున్నారు. తియ్యటి కబుర్లు చెబుతున్నారు. రూపాయిపెడితే వంద రూపాయలు వచ్చే స్టాక్స్ అంటూ ఉదరగొడుతున్నారు.
ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. వాటిలో పెట్టుబడులు పెట్టేవారు పెరిగారు.గతంలో డీమ్యాట్ అకౌంట్లు ఉండేవారు పరిమితంగా ఉండేవారు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్‌నే డీమ్యాట్ అకౌంట్ గా వినియోగించేలా బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. దీంతో ఓ జూదంలా చాలా మంది స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకుని ట్రేడింగ్ స్కాములు పెరుగుతున్నాయి.