Nellore News : నెల్లూరు నగరంలో శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఓ స్కూటర్ ని ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. తల అంతా ఛిద్రమై, మెదడు బయటకు వచ్చి రోడ్డుపై ఆ దృశ్యం చాలా ఘోరంగా ఉంది. రోడ్డంతా రక్తసిక్తమై ఉంది. కనీసం ఆస్పత్రికి తరలించే అవకాశం కూడా లేదు. రోడ్డుపైనే బైక్ పక్కనే ఆ యువకుడు ప్రాణాలు వదిలాడు. ఆ యువకుడి పేరు సలీం. నెల్లూరులో వార్డ్ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు.
అతివేగంతో ప్రమాదం
నెల్లూరు నగరంలోని బారా షహీద్ దర్గా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు వేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. యువకుడి మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈలోగా ఆ యువకుడి ఐడీ కార్డు, ఇతర వివరాల కోసం వెదికారు. ఆ యువకుడి పేరు సలీం అని, నెల్లూరులోని 34వ డివిజన్ గౌతమి నగర్ సచివాలయం పరిధిలో వాలంటీర్ గా పనిచేస్తున్నట్టు తేలింది. ఆ యువకుడి జేబులో ఉన్న లెటర్ ద్వారా ఆ వివరాలు తెలిశాయి. అయితే ఆ లెటర్ చూసిన వారందరి కళ్లు చెమర్చాయి.
ఇంతకీ ఆ లెటర్ లో ఏముందంటే
గౌరవనీయులైన నెల్లూరు నగర మేయర్ గారికి...
నమస్కరించి వ్రాయునది ఏమనగా... నా పేరు ఎస్.డి. సలీమ్. నెల్లూరు నగరం 34/1 గౌతమి నగర్ సచివాలయంలో వాలంటీరుగా పని చేస్తున్నాను. ఈనెల 21న జరిగిన వాలంటీర్ల సత్కారం కార్యక్రమానికి నేను హాజరు కాలేకపోయాను. నేను కంటి పరీక్ష చేయించుకునేందుకు హాస్పిటల్ కి వెళ్లడంతో నేను హాజరు కాలేకపోయాను. కావున నాయందు దయ ఉంచి క్షమించగలరు. మరలా ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాను.
ఇట్లు ...మీ విధేయుడు
ఎస్.డి.సలీమ్..
లెటర్ ఇచ్చేందుకు వెళ్తూ
ఈ లెటర్ చూసిన తర్వాత అక్కడున్నవారి కళ్లు చెమర్చాయి. వాలంటీర్ల మీటింగ్ కి రాలేకపోయానని, అందుకు తనను క్షమించాలని ఆ లెటర్ లో రాసి ఉంది. అదే అతని చివరి లెటర్ అని అర్థమైంది. బారాషహీద్ దర్గాకు సమీపంలోనే నెల్లూరు నగర పాలక సంస్థ కార్పొరేషన్ ఉంది. వాలంటీర్ కార్పొరేష్ ఆఫీస్ కి ఆ లెటర్ ఇచ్చేందుకు వెళ్తూ చనిపోయాడా అనే అనుమానం కూడా ఉంది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు, వాలంటీర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తమ తోటి వాలంటీర్ చనిపోయాడన్న వార్త తెలుసుకుని నెల్లూరులోని వాలంటీర్లంతా అతడి మృతదేహాన్ని చూసేందుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలి వచ్చారు. విధి నిర్వహణలో సలీం చురుకుగా ఉండేవాడని గుర్తు చేసుకుని విలపించారు.
Also Read : Ramagundam News : 'నా చావుతో బాధితులకు న్యాయం జరగాలి'- ఆర్ఎఫ్సీఎల్ లో ఉద్యోగం కోల్పోయిన యువకుడు ఆత్మహత్య
Also Read : Vengalarao Comments: ఎంపీ రఘురామనే కొట్టాము, నువ్వెంత అంటూ బట్టలిప్పి మరీ చితకబాదారు: వెంగళరావు ఆవేదన