ఓ యువతిని ఇద్దరు యువకులు ఇష్టపడ్డారు. ఆ విషయం వారిద్దరికీ తెలుసు. అయితే అందులో ఒక యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ హత్య.. నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. ఇంతకీ హంతకుడెవరు, ఆ యువతితో ఉన్న పరిచయమే ఆ యువకుడి హత్యకు కారణమా..? పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్నవారికోసం గాలిస్తున్నారు. 


నెల్లూరు నగరం పరిధిలోని వెంగళ్రావు నగర్ కి చెందిన ఆటో డ్రైవర్ సునీల్ హత్య కేసు ఇటీవల కలకలం రేపింది. గురువారం అర్థరాత్రి సునీల్ ని పడారుపల్లి బుజ్జయ్య లేఅవుట్లో దారుణంగా హత్య చేశారు దుండగులు. సునీల్ తల్లి ఫిర్యాదు మేరకు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. 


ఎవరా యువతి..?
వెంగళ్రావు నగర్ కి చెందిన ఆటో డ్రైవర్ సునీల్ తన ఇంటికి సమీపంలోని ఓ యువతితో సన్నిహితంగా ఉండేవాడు. ఈ విషయం సునీల్ తల్లికి తెలియడంతో ఆమె కొడుకుని మందలించారు. ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉండొద్దని వారించారు. కానీ సునీల్ వినలేదు. దీంతో తల్లి అతని సెల్ ఫోన్ తీసేసుకుంది. దాన్ని పగలగొట్టింది. అప్పటినుంచి సునీల్ తల్లి సెల్ ఫోన్ వాడుకునేవాడని చెబుతున్నారు. అయితే సునీల్ తో పాటు.. ఆ యువతి మరో యువకుడితో కూడా సన్నిహితంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఒకే అమ్మాయితో సన్నిహితంగా ఉండే వీరిద్దరూ గొడవ పడినట్టు చెబుతున్నారు. ఈ విషయమై  ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణలు  జరిగినట్టు సమాచారం. ఆ యువతితో సన్నిహితంగా ఉంటున్న మరో యువకుడే తన స్నేహితులతో కలిసి సునీల్‌ ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్నవారికోసం పోలీసులు గాలిస్తున్నారు. 


ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో దాడి, హత్య ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఓ అమ్మాయిని ప్రేమించిన యువకుడిని పెళ్లి కూడా ఖాయం చేసుకుని, యువతి బంధువులే దారుణంగా హతమార్చిన ఘటన ఇటీవలే నెల్లూరు నగరంలో జరిగింది. పెళ్లి చేస్తారని నమ్మిన యువకుడు, చివరకు కాబోయే బంధువుల చేతిలోనే హతమయ్యాడు. ఇప్పుడు సునీల్ హత్య కేసులో కూడా ఈ ప్రేమ వ్యవహారమే హత్యకు కారణం అని తేలింది. ఒకే అమ్మాయిని ఇద్దరు ఇష్టపడటం, ఇద్దరూ ఆమెతో చనువుగా ఉండటం, ఒకరంటే ఒకరికి పడకపోవడంతో సునీల్ హత్యకు గురయ్యాడు. ఆ అమ్మాయి ఎవరు, ఇద్దరితో ఉన్న సంబంధం ఏంటనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు త్వరలో వారి అరెస్ట్ ని నిర్థారిస్తారని తెలుస్తోంది.