సచివాలయ సెక్రటరీగా పనిచేస్తూ విధులు ముగించుకుని ఇంటికెళ్తోంది ఆ యువతి. ప్రతి రోజూ ఆమె అదే మార్గంలో వెళ్తుంది. కానీ ఈరోజు ఆమెను మృత్యువు కబళించింది. వెనుకనుంచి లారీ రూపంలో వచ్చి ప్రాణాలు తీసింది. నిన్న మొన్నటి వరకూ ప్రొబేషన్ పీరియడ్ ఎప్పుడు పూర్తవుతుందా అని అందరు సచివాలయ ఉద్యోగుల లాగే ఆమె కూడా ఎదురు చూసింది, నిరసనల్లో సైతం పాల్గొంది. చివరకు ప్రొబేషన్ డిక్లేర్ కాకముందే, సచివాలయ ఉద్యోగం పర్మినెంట్ అయ్యే సంతోష క్షణాలు రాకముందే ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోవడం విచారకరం. 




నెల్లూరు జిల్లా సంగం మండలం కోలగట్ల వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సచివాలయ సెక్రటరీ దుర్మరణం పాలైంది. ఆమె పేరు కరిష్మా భాను. బుచ్చిరెడ్డిపాలెం ఆమె స్వగ్రామం. అనంతసాగరం మండలం లింగంగుంటలో ఆమె సచివాలయ కార్యదర్శిగా పనిచేస్తోంది. విధులు ముగించుకుని లింగంగుంట నుంచి  తిరుగు ప్రయాణంలో బుచ్చిరెడ్డిపాలెం వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  


సంఘటనా స్థలంలో కరిష్మా భాను స్కూటీ పడిపోయి ఉంది. అక్కడే ఆమె హ్యాండ్ బ్యాగ్, విధులకు సంబంధించిన పుస్తకాలు, డాక్యుమెంట్లు, గిఫ్ట్ బాక్స్ అన్నీ రోడ్డుపై పడిపోయాయి. ఆ దృశ్యం అక్కడకు వచ్చినవారందర్నీ కలచి వేసింది. మృతురాలి తల పూర్తిగా ఛిద్రమైపోయింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. 




మృతురాలు కరిష్మా భాను బుచ్చిరెడ్డిపాలెం బెజవాడ గోపాల్ రెడ్డి నగర్ కి చెందిన యువతి. అవివాహితురాలైన ఆమెకు ఓ అక్క, తమ్ముడు ఉన్నారు. తల్లిదండ్రులతో కలసి ఉంటూ ప్రతి రోజూ ఆమె విధులకు హాజరయ్యేవారు. బస్సు సౌకర్యం ఉన్నా కూడా ఆమె ఇటీవల స్కూటీ నేర్చుకుని నిత్యం స్కూటీపైనే ప్రయాణం సాగించేవారు. అయితే హైవే కావడంతో ప్రయాణ సమయంలో కరిష్మా భాను జాగ్రత్తగానే ఉండేవారని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. తమ బిడ్డ ఇంకా ఇంటికి తిరిగి రాలేదేమని వేచి చూస్తున్న సమయంలో ఇలా ఆమె మరణ వార్త వినాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 


ఆమె మరణ వార్త విని నెల్లూరు జిల్లా సచివాలయాల ఉద్యోగులంతా షాకయ్యారు. వాట్సప్ గ్రూపుల్లో ఆమె మరణానికి సంతాప సందేశాలు పంపుకుంటున్నారు. ఆమె కుటుంబానికి అండగా ఉండాలని సచివాలయ ఉద్యోగులు నిర్ణయించారు. ప్రతి రోజూ బైక్ లు లేదా స్కూటీల్లో విధులకు వచ్చే ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని గ్రూపుల్లో మెసేజ్ లు షేర్ చేసుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


Also Read: AP PRC Row: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పోరాటానికి నెటిజన్స్ మద్దతు కరువైందా.. ఆ గట్టునుంటావా? నాగన్న ఈ గట్టు కొస్తావా?


Also Read: Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు.. అక్కడ భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి