పుష్ప సినిమాలో ఎర్రచందనం దుంగలు పోలీసుల కళ్లుగప్పి తరలించడానికి హీరో రకరకాల ప్లాన్లు వేస్తుంటాడు. పెళ్లి బృందం వెళ్లే ట్రాక్టర్ లో, పాల వ్యాన్ లో, ఆంబులెన్స్ లో.. ఇలా రకరకాల మార్గాల్లో పోలీసుల ముందే  ఎర్ర చందనం దుంగల్ని తరలిస్తుంటాడు హీరో. కానీ పోలీసులకు చాలా రోజుల వరకు అనుమానం రాదు. ఆ తర్వాత నిఘా పెట్టి అన్ని వాహనాలను అడ్డుకుంటారు. సరిగ్గా ఇలాంటి వెరైటీ ఐడియాలతో నెల్లూరు జిల్లాలో కొంతమంది అక్రమంగా మద్యం తరలిస్తున్నారు. 


సహజంగా మద్యంపై నిషేధం ఉన్న ప్రాంతాల్లోనే ఇలా మందు అక్రమంగా తరలించి అమ్ముకుంటుంటారు. కానీ ఏపీలో మద్యంపై నిషేధం లేదు. కానీ.. ఏపీలో మందురేట్లు ఎక్కువగా ఉండటం, ప్రీమియం బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో చాలామంది ఇతర రాష్ట్రాలనుంచి మద్యం తెప్పించి అమ్ముతున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. కర్నాటక నుంచి అక్రమంగా మద్యాన్నీ తీసుకొచ్చి ఏపీలో అమ్ముతున్నారు. 


ఇటీవల ఏపీలో మందు రేట్లు తగ్గించాం, అన్ని బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చాం అని ప్రభుత్వం చెబుతోంది. అయితే మనోళ్లు మాత్రం పక్క రాష్ట్రాల మద్యానికి బాగా అలవాటు పడ్డారు. అందులోనూ సరిహద్దు జిల్లాల్లో ఉన్నవారికి ఇదో సైడ్ బిజినెస్ గా మారింది. అక్కడినుంచి సీసాలు తేవడం, ఇక్కడ అమ్ముకోవడం, డబ్బులు సంపాదించడం. ఇలా ఉంది కొంతమంది పరిస్థితి. మార్జిన్ బాగా ఎక్కువగా ఉండటంతో.. చాలామంది రిస్క్ చేస్తున్నారు. పోలీసులకు పట్టుబడితే కేసులు పెడతారని తెలిసినా కూడా తప్పుడు పనులకు అలవాటు పడ్డారు. స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసినా, ఏదో ఒక రూపంలో మద్యాన్ని తరలిస్తున్నారు. 


ఇటీవల నెల్లూరులో కోళ్ల వ్యర్థాలు తరలించే నెపంతో మందు బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత వాటిపై పెద్దగా నిఘా పెట్టలేదు. కానీ మరికొందరు ఇదే ఫార్ములా పట్టుకున్నారు. కోళ్ల వ్యర్థాల దుర్వాసన ఎక్కువగా ఉంటుంది, వాటి జోలికి రావాలన్నా కూడా పోలీసులు వెనకడుగు వేస్తారు. అందుకే దీన్ని అలవాటు చేసుకున్నారు కొంతమంది. కోళ్ల వ్యర్థాల మాటున మందు బాటిళ్లు పక్క రాష్ట్రాలనుంచి తెస్తున్నారు. 


కోళ్ల వ్యర్థాల మాటున జరుగుతున్న మద్యం అక్రమ రవాణాకు నెల్లూరు సెబ్‌ అధికారులు చెక్‌ పెట్టారు. పక్కా ప్రణాళికతో కర్నాటక నుంచి భారీగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. వెంకటాచలంలోని టోల్‌ ప్లాజా వద్ద సెబ్‌ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. కోళ్ల వ్యర్థాలతో ఉన్న రాలీ వచ్చి ఆగింది. గూడూరు వైపు నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఈ లారీని నిలిపి పరిశీలించగా.. లోపల 20ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో కోళ్ల వ్యర్థాలున్నాయి. తీవ్ర దుర్వాసన వస్తోంది. లోపల ఉన్నవారి ప్రవర్తన అనుమానంగా ఉండటంతో.. అధికారులు డ్రమ్ముల్లో తనిఖీ చేశారు. ఆ డ్రమ్ముల్లో గోతాల మూటలున్నట్లు గుర్తించారు. వాటిని విప్పి చూడగా మద్యం సీసాలున్నాయి. మొత్తం 450లీటర్ల మద్యాన్ని సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నాటక నుంచి కోవూరికి అక్రమంగా ఈ మద్యాన్ని తరలిస్తున్నారని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


Also Read: సగం రేటుకు బంగారం ఇస్తామని ఫోన్ కాల్.. నోట్ల కట్టలతో పొరుగు రాష్ట్రం వెళ్లాక ఊహించని ట్విస్ట్..


Also Read: ఓపెనింగ్‌ ఊరుకోనివ్వదు.. క్లోజింగ్‌ నిద్రపోనివ్వదు.. దీనికి అలవాటు పడితే జీవితాలే నాశనం!


Also Read: సముద్ర గర్భంలో బద్దలైన అగ్నిపర్వతం.. ముంచెత్తిన సునామీ.. శాటిలైట్ వీడియో వైరల్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి