మంచి చెప్పబోయిన వారినే మట్టుబెట్టాలని చూశారు దుర్మార్గులు. తమకి అన్యాయం చేస్తున్నారన్న అనుమానంతో దాడికి పాల్పడ్డారు. అన్నదమ్ముల మధ్య గొడవ సర్దుబాటు చేయాలని చూసిన పాపానికి చివరకు ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా జలదంకి గ్రామంలో జరిగింది. నెల్లూరు జిల్లా జలదంకి గ్రామంలోని ఉత్తర వీధిలో నివాసం ఉంటున్న శనివారపు హరికృష్ణ , కావలిలో నివాసం ఉంటున్న ఆయన అన్న శనివారపు శ్రీనివాసులు మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం తలెత్తింది. ఇటీవల అనారోగ్యం కారణంగా వారి తల్లి మృతి చెందింది. ఆమె మరణం తర్వాత ఆస్తి పంపకాల విషయంలో ఇద్దరూ తరచూ గొడవపడేవారు. చివరకు ఈ పంచాయితీ పెద్దమనుషుల వద్దకు చేరింది. జలదంకిలోనే పెద్దమనుషులు అన్నదమ్ముల్ని కూర్చోబెట్టి మాట్లాడారు. ఇద్దరికీ సర్దుబాటు చేయాలని చూశారు. కానీ అన్నదమ్ములిద్దరూ ఆస్తి విషయంలో రాజీ పడలేదు. పైగా హరికృష్ణ అన్నపై రగిలిపోయాడు. 


మధ్యవర్తులపై దాడి


పెద్దమనుషుల సమక్షంలో చర్చలు జరిగినా ఇద్దరూ తగ్గలేదు. ఈ క్రమంలో శనివారపు శ్రీనివాసులకు మద్దతుగా నాగిశెట్టి మధు అనే వ్యక్తి మాట్లాడాడు. దీంతో తమ్ముడు హరికృష్ణ మధుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన అన్నకి సపోర్ట్ గా వస్తూ తనకి ఆస్తి దక్కనీయకుండా చేస్తున్నాడంటూ మధుపై మండిపడ్డాడు. పంచాయితీ పూర్తై తిరిగి వెళ్తున్న క్రమంలో మధుపై దాడి చేశాడు హరికృష్ణ. హరికృష్ణ కొడుకు నరసింహనాయుడు కూడా ఈ దాడిలో పాల్గొన్నాడు. ఇటు మధుని రక్షించేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు వ్యక్తులు కూడా దాడిలో గాయపడ్డారు. మధుపై దాడిని అడ్డుకోబోయిన పాలంకి మధు, పాలంకి లక్ష్మణ్ కు గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. 




పోలీస్ పహారా.. 
హరికృష్ణ, హరికృష్ణ కుమారుడు నరసింహనాయుడు.. మధ్యవర్తులుగా వచ్చిన ముగ్గురిపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకొని  ఘటనా స్థలానికి చేరుకున్నారు జలదంకి ఎస్ఐ ఆంజనేయులు. గ్రామంలో విచారణ చేపట్టారు. శనివారపు హరికృష్ణ, శనివారపు నరసింహనాయుడులను అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.


ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో జరిగిన వరుస ఘటనలు కలవరం కలిగిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే నెల్లూరులో  రెండు జంట హత్యలు జరిగాయి. హోటల్ సొమ్ముకోసం యజమానుల్నే అత్యంత కిరాతకంగా గొంతుకోసి హత్య చేశారు హోటల్ లో పనిచేసే సిబ్బంది. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల్ని ఓ ఆటో డ్రైవర్ చంపేశాడు. మరో ఘటనలో ఇద్దరు తమిళనాడు వాసులు తమని అవమానించాడంటూ మరో వ్యక్తిని చంపేశారు. వరుస ఘటనలతో నెల్లూరు ఉలిక్కిపడుతోంది. ఇటు ఆస్తి తగాదాలు కూడా చివరకు ఇలాంటి దాడులకు దారి తీస్తున్నాయి. తాజా ఘటనలో కేవలం మధ్యవర్తిత్వం కోసం వెళ్లినందుకు ముగ్గురు గాయపడ్డారు. అన్నదమ్ముల గొడవలో వీరు గాయాలపాలయ్యారు. ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సంబంధం లేని విషయంలో తమ వారు ఇబ్బంది పడ్డారని అంటున్నారు. జలదంకి గ్రామంలో ప్రస్తుతం పోలీసులు పరిస్థితి అదుపు తప్పకుండా పరాహా కాస్తున్నారు.