Nellore News : నెల్లూరు జిల్లా కోవూరులోని విషాద ఘటన చోటుచేసుకుంది. అపార్ట్ మెంట్ పై నుంచి ఓ బాలిక కిందపడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోంది. దగ్గరకు వెళ్లి చూస్తే అదే అపార్ట్ మెంట్ లో నివశించే బాలిక. హఠాత్తుగా పై నుంచి పడిపోయింది. ప్రమాదమా, లేక ఆత్మహత్యా, లేక ఇంకేదైనా కారణమా అని పోలీసులకు సమాచారమిచ్చారు. చివరకు పోలీసులు వచ్చిన తర్వాత అసలు సంగతి తేలింది?
కోవూరులోని సాయి సుప్రజ అపార్ట్ మెంట్ లో పిడుగు శ్రీనివాసరావు, ఆయన కుమార్తెతో కలసి నివసిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం శ్రీనివాసరావు భార్య చనిపోవడంతో కుమార్తెతో కలసి ఉంటున్నారు. ప్రస్తుతం ఆ బాలిక జడ్పీ హైస్కూల్ లో పదో తరగతి చదువుతోంది. బాలిక హఠాత్తుగా తాము నివసించే అపార్ట్ మెంట్ పైకి వెళ్లి కిందకు దూకింది. బలవన్మరణానికి పాల్పడింది.
పిడుగు శ్రీనివాసరావు కుటుంబం కొన్నాళ్ల క్రితం నెల్లూరు నుంచి కోవూరుకి వలస వచ్చింది. ఇక్కడే ఉంటున్నారు. అయితే నెల్లూరు లేక్ వ్యూ కాలనీకి చెందిన ఓ యువకుడితో శ్రీనివాసరావు కుమార్తెకు పరిచయం ఉండేదని తెలుస్తోంది. ఈ పరిచయం పెరిగి పెద్దది కావడం, తండ్రి మందలించడంతో బాలిక ఇంట్లోనే ఉంటూ చదువుకుంటోందని చెబుతున్నారు. అయితే నెల్లూరుకు చెందిన యువకుడు మాత్రం ఆ అమ్మాయి వెంటపడుతున్నాడని, వేధిస్తున్నాడని, అతని ప్రవర్తన వల్ల ఆ అమ్మాయి ఇటీవల బాగా ఇబ్బంది పడుతున్నట్టు చెబుతున్నారు. సడన్ గా ఇవాళ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ వ్యవహారం బయటపడింది.
పోలీసులు అదుపులో యువకుడు
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. బాలిక ఆత్మహత్యకు కారణమని భావిస్తున్న బాలు అనే యువకుడిని కోవూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే అతడి అరెస్ట్ ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆడుతూ పాడుతూ చలాకీగా ఉండే ఆ బాలిక హఠాత్తుగా ఆత్మహత్యకు పాల్పడిందంటే అపార్ట్ మెంట్ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోవూరులో కూడా ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడటం వల్ల సమస్యలు పరిష్కారం కావని, క్షణికావేశంలో జీవితాలు కడతేర్చుకుని కన్నవారికి క్షోభ మిగల్చొద్దని చెబుతున్నారు పోలీసులు.
మోక్షం కోసం సూసైడ్
మోక్షం వస్తుందని, తనకు తానుగా నిప్పంటించుకుని మృతి చెందాడో వ్యక్తి. అరుంధతి సినిమాను చూసి స్ఫూర్తి పొందిన 23 ఏళ్ల రేణుకా ప్రసాద్..ఈ దారుణానికి పాల్పడ్డాడు. బెంగళూరులోని తుమకూరు జిల్లాలో జరిగిందీ ఈ ఘటన. 20 లీటర్ల పెట్రోల్ తన శరీరంపై పోసుకుని నిప్పంటించుకున్నట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధరించారు. రేణుకా ప్రసాద్ తండ్రి...ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడికి వెళ్లి షాక్‌కు గురయ్యారు. "నాకు మోక్షం ప్రసాదించు" అంటూ తనను బతిలాడినట్టు తండ్రి చెబుతున్నారు. "నేను ఎన్నోసార్లు చెప్పాను. ఆ అరుంధతి సినిమా చూడకు అని. ఇప్పుడు నీకే గతి పట్టిందో చూడు" అని వాపోయినట్టు తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్‌కు తరలించే సమయానికే రేణుకా ప్రసాద్ శరీరం దాదాపు 60%మేర కాలిపోయింది. SSLCలో టాపర్‌గా రాణించిన ప్రసాద్‌ను ఉన్నత చదువుల కోసం తుమకూరుకు పంపారు తల్లిదండ్రులు. "ప్రసాద్..సినిమాలకు అడిక్ట్ అయ్యాడు. ముఖ్యంగా అరుంధతి సినిమాను పదేపదే చూసేవాడు. ఆ సినిమాలోని పాత్రల్ని ఇమిటేట్ చేసేవాడు. ప్రీ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్‌లో ఫెయిల్ అయ్యాక ఇంటికి వచ్చేశాడు. అప్పటి
నుంచి ఉద్యోగం చేయకుండా ఖాళీగానే ఉన్నాడు. ఆ సమయంలోనే అరుంధతి సినిమాను చూడటం వ్యసనంగా మారింది" అని రేణుకా ప్రసాద్ కజిన్ ఒకరు చెప్పారు. కొడిగెనహల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అంత పెద్ద మొత్తంలో పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!