ఎన్నిసార్లు పోలీసులు అధికారులు హెచ్చరించినా కొందరు ప్రజలు మారడం లేదు. తక్కువ ధరకు మనకు ఏం లభిస్తుంది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పెట్టుబడి అని ఎవరైనా చెబితే సులువుగా నమ్మేసి కొందరు అమాయకులు ఈ కిలేడీ దంపతుల చేతికి చిక్కుకున్నారు. చివరికి తాము మోసపోయామని తెలుసుకునేసరికి ఆలస్యం అవుతుంది. లక్షల్లో నష్టపోయామంటూ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుంటారు.


కిలాడి దంపతులు అరెస్ట్..
నకిలీ బంగారంతో ప్రజలకు టోకరా వేయాలని చూశారు కిలాడీ దంపతులు. నకిలీ బంగారాన్ని.. స్వచ్ఛమైన బంగారంగా నమ్మించి రూ. 5.40 లక్షలు దోచుకెళ్లిన కిలాడీ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ సబ్ డివిజన్ కార్యాలయంలో ప్రెస్ మీట్‌లో నార్త్ రూరల్ ఇంఛార్జి సీఐ జగడం నరేష్, మాక్లూర్ ఎస్సై యాదగిరిగౌడ్ కలిసి ఏసీపీ ఆరె వెంకటేశ్వర్ వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లా సంగెం ప్రాంతానికి చెందిన దంపతులు కర్రెద్దుల సుభాషిణి, మాల్యాద్రి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశపడ్డారు. ఈ క్రమంలో నకిలీ బంగారాన్ని అసలుగా నమ్మించి మోసగించాలని ప్లాన్ చేశారు. చివరికి కటకటాల పాలయ్యారు. 


ఈ నెల 7న మాక్లూర్ మండలం సాట్లాపూర్ తండాకు వెళ్లారు. అక్కడ రాములు అనే వ్యక్తిని పరిచయం చేసుకన్నారు. తమకు అత్యవసరంగా డబ్బులు అవసరం ఉందని.. తమ వద్ద ఉన్న వడ్డాణాన్ని తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పారు. నిజమేనని నమ్మిన బాధితుడు రూ.5.40 లక్షలు అడ్వాన్సుగా చెల్లించాడు. వారు నకిలి బంగారాన్ని అతడికి కట్టబెట్టారు. బాధితుడు సత్వరమే గుర్తుపట్టకుండా కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చారు. కాసేపటి తర్వాత తేరుకొన్న ఆయన మోసపోయినట్లు గుర్తించాడు. మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులను నిజామాబాద్ లో పట్టుకుని.. రూ.2.22 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగనుంది.


ఆ ఫోన్ కాల్స్ వస్తే బీ అలర్ట్..
‘తక్కువ ధరకే బంగారం ఉందని ఫోన్ కాల్స్ కూడా వస్తాయి. బిస్కెట్ బంగారం ఉంది. మళ్ళీ అవకాశం రాదు. డబ్బులు తొందరగా రెడీ చేసుకోండి. ఇలాంటి కాల్స్ కి అస్సలు మోసపోవద్దు. నకిలీ బంగారాన్ని గుర్తు పట్టని విధంగా ఏమార్చుతారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా ప్రజలే అప్రమత్తం గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని’ పోలీసులు, అధికారులు మరోసారి ప్రజలను హెచ్చరించారు.


Also Read: Kakinada Tiger Updates: రోజుకో ప్లేస్ మార్చుతూ ముప్పు తిప్పలు - బోనుకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్న బెంగాల్ టైగర్


Also Read: Basar IIIT News: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల నిరసనలకి శుభం కార్డు, అర్ధరాత్రి మంత్రితో చర్చలు సఫలం