Natwar Lal The man who sold Taj Mahal | మాయ మాటలు చెప్పి  తమది కాని స్థలాల్ని,బిల్డింగ్స్ ని అమ్మేసే మోసగాళ్లు గురించి వార్తల్లో మనం వినే ఉంటాం. కానీ ఏకంగా తాజ్ మహల్ నే తన ఆస్తి అని చెప్పి  అమ్మేసిన కేటుగాడు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? భారతదేశపు అతిపెద్ద కేటుగాడిగా పేరుపొందిన  నట్వర్ లాల్ ఏకంగా మూడుసార్లు తాజ్ మహల్ ని  అమ్మేసిన వైనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


 ఫోర్జరీతో మొదలుపెట్టి వేశ్యల నగలు దోచేసే వరకూ 


 బీహార్ లోని  బాంగ్రాలో 1912లో పుట్టాడు నట్వర్ లాల్. చిన్నప్పటి పేరు మిథిలేష్ కుమార్ శ్రీవాత్సవ. అతని తండ్రి స్టేషన్ మాస్టర్ గా పనిచేసేవాడు. ఒకసారి వాళ్ళ ఎదురింటి వ్యక్తి బ్యాంకులో డిపాజిట్ చేయమని ఇచ్చిన డ్రాఫ్ట్ పై సంతకం గమనించిన నట్వర్ లాల్ దాన్ని ఫోర్జరీ చేసి అదే బ్యాంకు నుండి వెయ్యి రూపాయలు కొట్టేయడంతో అతని నేర చరిత్ర మొదలైంది. ఆ వెయ్యి రూపాయలతో  కలకత్తా పారిపోయిన  నట్వర్ లాల్ అక్కడే కామర్స్ లో డిగ్రీ చేస్తూ  మరోవైపు  నేరాలు మోసాలు మొదలుపెట్టాడు. గొప్ప వాళ్ళ సంతకాలు ఫోర్జరీ  చేయడం బ్యాంకుల్లోంచి డబ్బు కొట్టేయడం  అతనికి సర్వసాధారణమైపోయింది. రెగ్యులర్ గా వేశ్యా గృహాలకు వెళ్లి వాళ్లకి మందులో మత్తుమందు కలిపిచ్చి వాళ్లు స్పృహ కోల్పోయాక నగలు ఎత్తుకు పోయేవాడు. ఇది రిస్క్ అని భావించి కొంతకాలానికి ఆ పని మానేశాడు.


డిగ్రీ చేతికి వచ్చాక పెద్ద మోసాలకు దిగిన  నట్వర్ లాల్ 1937లో సంతకం ఫోర్జరీ చేసి 9 టన్నుల ఇనుము కొట్టేసాడు. అయితే ఈ కేసులోనే మొట్టమొదటిసారిగా  అతను అరెస్ట్ అయ్యాడు. బయటికి వచ్చిన తర్వాత రకరకాల పేర్లతో ఒక్కొక్క సిటీ మారుస్తూ బ్యాంకులను, నగల షాపు యజమానులను, విదేశీయులను  టార్గెట్ చేసి మోసం చేసి లక్షల్లో సంపాదించాడు. పోలీస్ రికార్డ్స్ ప్రకారం  కనీసం 50 కి పైగా మారుపేర్లతో నట్వర్ లాల్ జనాన్ని మోసం చేసేవాడు.విచిత్రం ఏంటంటే అతను చేసిన నేరాల్లో ఎక్కడా హింస అనేది ఉండేది కాదు. కేవలం మనుషులను మోసం చేయడం డబ్బు నగలు కొట్టేయడం ఇదే నట్వర్ లాల్ లక్ష్యంగా మారిపోయింది. అలాంటి వాటిలో అతి ముఖ్యమైనది  తాజ్ మహల్ ను అమ్మేయడం.


మూడుసార్లు తాజ్ మహల్ అమ్మేసిన నట్వర్ లాల్


 అవి స్వాతంత్య్రం వచ్చిన రోజులు. అప్పటికే మోసాల్లో ఆరితేరిపోయాడు నట్వర్ లాల్. తాజ్ మహల్ ని  చూడడానికి వచ్చే విదేశీయుల్లో కొందరిని టార్గెట్ చేసి తాను ప్రభుత్వ అధికారినని నిధులు పోగు చేయడం కోసం ప్రభుత్వం తాజ్ మహల్ లాంటి చారిత్రక కట్టడాలను అమ్మేస్తుందని  నమ్మించి వారికి తాజ్ మహల్ ని అమ్మేశాడు. నట్వర్ లాల్ ఇచ్చిన సేల్ పత్రాన్ని పట్టుకుని  అధికారులకు చూపించిన ఫారినర్స్ తాము మోసపోయామని గుర్తించారు. ఇలా మొత్తం మూడు సార్లు తాజ్ మహల్ ను విదేశీయులకు అమ్మేశాడు నట్వర్ లాల్. అయితే తాము తాజ్ మహల్ ను కొని మోసపోయామనే విషయాన్ని కేసు పెట్టి నవ్వులపాలు ఇష్టం లేక ఆ ఫారినర్స్ సైలెంట్ అయిపోయారు. నట్వర్ లాల్ ఇదే పంథాలో ఎర్రకోట, రాష్ట్రపతి భవన్ లాంటి కట్టడాలను కూడా అమ్మేసినట్టు కథలు ప్రచారంలో ఉన్నాయి కానీ వాటికి ఆధారాల్లేవు.  


Also Read: Inspirational Story: ఐఏఎస్‌కు రిజైన్ చేసి యూట్యూబ్ చానల్ పెట్టాడు - అందరూ పిచ్చోడనుకున్నారు కట్ చేస్తే రూ.26వేల కోట్ల కంపెనీకి ఓనర్ - రోమన్ సైనీ గురించి విన్నారా ?


టాటాలు, బిర్లాలు కూడా నట్వర్ లాల్ బాధితులే 


నట్వర్ లాల్ ప్రధానంగా ధనవంతులనే టార్గెట్ చేసేవాడు. టాటాలు, బిర్లాలు వంటి  ధనవంతుల వద్ద నుండి సంతకాలఫోర్జరీ తాను బాగా డబ్బున్న వాడిని అని చెప్పి పెద్ద మొత్తంలో అప్పు తీసుకుని  మాయం అయిపోవడం అతనికి  అలవాటైపోయింది. 1950ల్లో 'పంజాబ్ నేషనల్ బ్యాంక్ ' కు నిత్యం వెళుతూ డబ్బు అకౌంట్ లో వేస్తూ తీస్తూ ఉండేవాడు. బ్యాంకు వాళ్లు ఇతను ఎవరో చాలా గొప్పవాడు  అని నమ్మేశారు. తర్వాత ట్రైన్ లో చాలా పెద్ద మొత్తంలో తన రైస్ బ్యాగ్స్ వచ్చాయని దానికోసం డబ్బులు కట్టాలని fake చెక్ ఇచ్చి  ఆరున్నర లక్షలు బ్యాంకు నుండి తీసుకుని మాయమైపోయాడు. ఆ రోజుల్లో అది చాలా చాలా పెద్ద మొత్తం.


130 ఏళ్ల జైలు శిక్ష -10 సార్లు ఎస్కేప్ 
అటు బ్రిటిష్ ప్రభుత్వాన్ని, స్వతంత్రం వచ్చాక భారత ప్రభుత్వాన్ని నట్వర్ లాల్ ఎంత ఇబ్బంది పెట్టాడంటే పట్టుబట్టి పోలీసులు అతనిపై ఆధారాలు పోగుచేసి, మోసపోయిన వాళ్ళను ఒప్పించి 100కు పైగా కేసులు నమోదు చేశారు. వాటిలో 14 పైగా ఫోర్జరీ కేసులే ఉన్నాయి. కోర్టు అతనికి మొత్తం 130 ఏళ్ల జైలు శిక్షను విధించింది. అయితే తన జీవితకాలంలో మొత్తం కలిపి 20 ఏళ్లు మాత్రమే జైలు జీవితం గడిపాడు నట్వర్ లాల్. పదిసార్లు జైలు నుంచి తప్పించుకున్నాడు. ఒకసారి జైలులో ఉన్న అధికారి బట్టలు కొట్టేసి  ఆ యూనిఫామ్ తో  ఎంచక్కా బయటకు నడుచుకు వెళ్లిపోయాడు. మరోసారి తనను పట్టుకున్న  అధికారులకు డబ్బులున్న సూట్ కేసు లంచంగా ఇచ్చి తప్పించుకున్నాడు. అతడు వెళ్లిపోయాక చెక్ చేస్తే సూట్ కేసులో డబ్బులకు బదులు తెల్ల కాగితాలు ఉన్నాయి.


అనేకసార్లు పోలీసుల నుంచి  తప్పించుకున్న నట్వర్ లాల్ చివరిసారిగా 84 ఏళ్ల వయసులో  1996లో అరెస్టు అయ్యాడు. అతన్ని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి మెడికల్ టెస్టుల కోసం ఎయిమ్స్ కు తీసుకెళుతున్న సమయంలో అతను మాయం అయ్యాడు. ఇప్పటికీ అతని ఆచూకీ దొరకలేదు. నట్వర్ లాల్ కు ఒక తమ్ముడు ఉండేవాడు. తన అన్నయ్య  1996 లో రాంచీలో చనిపోయాడని చెప్పుకొచ్చాడు. అయితే నట్వర్ లాల్ లాయర్ మాత్రం  నట్వర్ లాల్ 2009 వరకూ జీవించే ఉన్నట్టు కోర్టుకు తెలిపి  అతను 2009 జులై 25న చనిపోయాడు కాబట్టి పెండింగ్ లో ఉన్న 100 కేసులు కొట్టేయాలని  కోరాడు. దీనితో నట్వర్ లాల్ మరణం విషయంలోనూ ప్రపంచానికి స్పష్టత లేకుండా చేశాడు. 



 సొంతూళ్ళో రాబిన్ హుడ్ ఇమేజ్ 


 నట్వర్ లాల్ సొంత ఊరు బాంగ్రా లో అతనికి రాబిన్ హుడ్ ఇమేజ్ ఉంది. గొప్పవాళ్ళను దోచి పేదలకు పెడతాడనేది వాళ్ళు చెప్పే కథనం. నట్వర్ లాల్ ఊరికి వచ్చినప్పుడు అతడ్ని చూడడానికి పెద్ద ఎత్తున జనం వచ్చేవారని వారు ఇప్పటికీ చెబుతారు.  అలాగే ఒకసారి ఊరికి వచ్చినప్పుడు నట్వర్ లాల్ పెద్ద పార్టీ ఇచ్చి దానికి వచ్చిన పేదవాళ్లకు  ఒక్కొక్కరికి వంద రూపాయలు చొప్పున  పంచాడట. ఆ రోజుల్లో అది పెద్ద మొత్తం. నట్వర్ లాల్ కు ఇద్దరు భార్యలు, ఒక కుమార్తె. 


 బాలీవుడ్ లో సినిమాలు 


  నట్వర్ లాల్  జీవతంలో జరిగిన  సంఘటనలు ఆధారంగా బాలీవుడ్ లో సినిమాలు సైతం వచ్చాయి. 1979 లో అమితా బచ్చన్ హీరోగా Mr. నట్వర్ లాల్, 2014 లో ఇమ్రాన్ హష్మీ హీరో గా రాజా నట్వర్ లాల్ తీశారు. నట్వర్ లాల్ 'తాజ్ మహల్ ' ను అమ్మేసిన సంఘటన ఆధారంగా 2005లో అభిషేక్ బచ్చన్ సూపర్ హిట్ మూవీ 'బంటి ఔర్ బబ్లీ ' సీన్స్ ఉంటాయి. ఏమైనా దేశం లోని ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి విపరీతమైన మోసాలు చేసి కోట్ల కొద్ది డబ్బు కొట్టేసిన కేటుగాడు నట్వర్ లాల్ చివరికి ఏమయ్యాడో తెలియకుండా మాయమైపోవడం ఇప్పటికీ ఇండియన్ క్రైమ్ హిస్టరీలో ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది.


Also Read: Bangladesh: భారత్‌పై మరో భయంకర కుట్ర చేస్తున్న బంగ్లాదేశ్ - పాకిస్థాన్ టెర్రరిస్టుల్ని పంపేందుకు పక్కా ప్లాన్ ?