Muchumarri Minor Girl Case | నంద్యాల: ఏపీలో సంచలనం రేపిన బాలిక సామూహిక హత్యాచారం ఘటనపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో 8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అఘాయిత్యానికి పాల్పడి హత్య చేయడం తెలిసిందే. బాలురు సెల్‌ఫోన్లో అశ్లీల వీడియోలు చూసేవారని, ఈ క్రమంలో అఘాయిత్యం చేసి ఉంటారని నంద్యాల ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, మాజీ ఎస్పీ రఘువీరా రెడ్డి తెలిపారు.
చాక్లెట్ ఇచ్చి బయటకు తీసుకెళ్లి బాలికపై మైనర్ బాలురు లైంగిక దాడికి పాల్పడి దారుణం చేసినట్లు వెల్లడించారు. మొదట బాలిక మృతదేహాన్ని ఆ బాలుర తండ్రి మరొకరి సాయంతో గడ్డిలో పెట్టి వనమలపాడుకు బైకు మీద తీసుకెళ్లారు... అక్కడి నుంచి పుట్టిలో తీసుకెళ్లి బాలిక మృతదేహానికి రాయి కట్టి కృష్ణా నదిలో పడేశారని సంచలన విషయాలు వెల్లడించారు. పిల్లలు కేసుల్లో ఇరుక్కుంటారని అఘాయిత్యానికి పాల్పడిన ఓ బాలుడి తండ్రి, పెదనాన్న బాలిక డెడ్ బాడీని మాయం చేశారు. వారిని కేసులో ఏ4, ఏ5గా చేర్చనున్నారు. ముచ్చుమర్రి బాలిక కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, మృతదేహం కోసం అన్ని ప్రయత్నాలు చేశామన్నారు.
ఓ చిన్నారి చెప్పిన సమాచారంతో బాలుర అరెస్ట్
సాక్ష్యాలు సేకరించిన తరువాత కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మొదట బాలిక మిస్సింగ్ 69/21 సెక్షన్ నుంచి 70/2, 103/1, 238ఏ గా కేసును మార్చినట్లు నంద్యాల ఎస్పీ మంగళవారం మీడియాకు తెలిపారు. పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. మొదట బాలిక మిస్సింగ్ కేసు నమోదుచేయగా, అనంతరం కేసును అత్యాచారం, హత్య సెక్షన్లు జత చేసినట్లు ఆయన వెల్లడించారు. బాలికలు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఉండేందుకు తరచూ కౌన్సెలింగ్ ఇస్తున్నాం, చట్టాలపై అవగాహనా కల్పిస్తున్నా ఇలాంటివి జరగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక మిస్సింగ్ ఫిర్యాదు వచ్చిన వెంటనే యాక్షన్ తీసుకుని గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆడుకుంటున్న ఓ చిన్నారి చెప్పిన సమాచారంతో దర్యాప్తు ముమ్మరం చేసి ముగ్గురు మైనర్ బాలుర్ని గుర్తించినట్లు చెప్పారు.
బాలికపై ముగ్గురు బాలురు అఘాయిత్యం, హత్య
నంద్యాల జిల్లాలోని పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో కొన్ని రోజుల కిందట ముగ్గురు బాలురు ఓ 8 ఎనిమిదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి, అత్యాచారం చేశారు. విషయం ఎవరికైనా చెబుతుందని బాలికను హత్య చేశారు బాలురు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన ముగ్గురు 14 నుంచి 16 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా, బాలిక మృతదేహం లభ్యం కావడం లేదు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు రోజుల తరబడి కృష్ణా నదిలో వెతికినా ప్రయోజనం లేకపోయింది. పోలీసులు బాలురు చెప్పిన చోట తవ్వి చూసినా బాలిక డెడ్ బాడీ దొరకలేదు. మరోసారి విచారించగా శవాన్ని నదిలో పడేశామని చెప్పగా ఆకోణంలో విచారణ చేపట్టి, గజ ఈతగాళ్లు కాలువలో గాలించినా డెడ్ బాడీ దొరకలేదు.
తల్లిదండ్రులు పనుల్లో బిజీగా ఉండటం, ఇద్దరి పర్యవేక్షణ లేకపోవడం, కొందరు తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్తూ పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్ వద్ద వదిలి వెళ్తున్నారు. పిల్లలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, కొందరి ఇళ్లల్లో తాగడం లాంటి పెద్దల వ్యసనాల కారణంగా బాలురు, యువత లైంగిక దాడులకు పాల్పడే అవకాశం ఉందన్నారు.
Also Read: తీవ్ర విషాదాలు - బంధువుల దుష్ప్రచారంతో నవ దంపతుల సెల్ఫీ సూసైడ్, ఆర్థిక ఇబ్బందులతో రైల్వే ఉద్యోగి