Loan App Threats : తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ వేధింపులు ఆగడంలేదు. నిత్యం ఎక్కడో ఒకచోట లోన్ యాప్ వేధింపులకు అమాయకులు బలైపోతున్నారు. అత్యవసరం కోసం చేసిన అప్పు వారి ప్రాణాలను తోడేస్తుంది. లోన్ చెల్లించినా ఇంకా చెల్లించాలంటూ లోన్ యాప్ నరకాసురులు వెంటపడి వేధించి ప్రాణాలు తీసేస్తున్నారు. రాష్ట్రం ప్రభుత్వాలు, ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించినా వ్యవస్థలోని లూప్ హోల్స్ తో లోన్ యాప్ లు నిర్వహిస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. తీసుకున్న లోన్ తిరిగి చెల్లించినా ఇంకా కట్టాలని చెబుతూ ఫోన్ లోని కాంటాక్ట్స్ అసభ్యకర మెసేజ్ పెడుతూ, గ్యాలరీలోని ఫొటోలను మార్ఫింగ్ చేసి పరువుతో పాటు ప్రాణాలు తీసేస్తున్నారు. ఇటీవల రాజమండ్రిలో దంపతుల ఆత్మహత్య ఘటన మరువక ముందే నంద్యాలకు చెందిన మరో విద్యార్థి లోన్ యాప్ వేధింపులకు బలైపోయాడు. 


బీటెక్ విద్యార్థి ఆత్మహత్య 


 తెలుగు రాష్ట్రాల్లో లోన్‌ యాప్‌ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఎంతో ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా నంద్యాలలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. లోన్‌ యాప్‌ నిర్వాహకుల టార్చర్ భరించలేక వీరేంద్ర అనే ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నంద్యాలలోని బాలాజి కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్న వీరేంద్ర బెంగళూరులో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అత్యవసరం అయ్యి ఓ యాప్‌ నుంచి లోన్‌ తీసుకున్నాడు. తిరిగి చెల్లించడంలో ఆలస్యం అవ్వడంతో లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులు స్టార్ట్ చేశారు. వీరేంద్ర అప్పు చెల్లించాలని అతడి బంధువులు, మిత్రులకు యాప్ నుంచి ఫోన్ చేశారు. 


ఫొటో మార్ఫింగ్ చేసి వేధింపులు 


వీరేంద్ర ఫొటోను మార్ఫింగ్ చేసి ఈ వ్యక్తి మా సంస్థలో లోన్‌ తీసుకొని చెల్లించలేదని ఓ మెసేజ్ జోడించి సోషల్ మీడియాలో పెట్టారు. అలాగే అతడి మిత్రులకు, బంధువులకు మార్ఫింగ్ ఫొటో పెట్టారు. వీరేంద్ర మీ నెంబర్‌ను రిఫరెన్స్‌గా ఇచ్చాడు. అతడు  లోన్ చెల్లించలేదు ఇప్పుడు మీరు లోన్‌ను తిరిగి చెల్లించాలి. లేదంటే మిమ్మల్ని అరెస్ట్‌ చేస్తాం అని మెసేజ్‌లో రాసుకొచ్చారు.  దీంతో అవమానంగా భావించిన వీరేంద్ర శనివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్‌ వేధింపుల కారణంగానే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తండ్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


రాజమహేంద్రవరంలో ఇలాంటి ఘటనే


రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు కారణమయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి చెందిన కొల్లి దుర్గాప్రసాద్‌ (32), రమ్యలక్ష్మి (24) దంపతులు రాజమహేంద్రవరంలోని శాంతినగర్‌లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దుర్గాప్రసాద్‌ జొమాటో డెలివరీ బాయ్‌ పనిచేస్తున్నారు. అతడి భార్య రమ్యలక్ష్మి మిషన్‌ కుట్టుకుంటూ జీవిస్తున్నారు.  ఇటీవల ఇంటి అవసరాల కోసం ఆన్ లైన్ లోన్ యాప్‌లో కొంత నగదు అప్పుగా తీసుకున్నారు. ఆ అప్పు సకాలంలో తీర్చకపోవడంతో  లోన్‌ యాప్‌కు సంబంధించిన టెలీకాలర్స్‌ ఫోన్ కాల్స్ చేసి వేధింపులు మొదలుపెట్టారు. అప్పు చెల్లించకపోతే భార్యభర్తల నగ్న చిత్రాలు ఆన్ లైన్ లో పెడతామని బెదిరించారు. దుర్గాప్రసాద్‌ బంధువులకు, స్నేహితులకు కాల్స్ చేసి తీసుకున్న విషయాన్ని చెప్పేవారు. ఈ ఘటనలతో పరువు పోయిందని భావించిన దంపతులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. 


Also Read : Prakasam News : ప్రాణం మీదకు తెచ్చిన వివాహేతర సంబంధం, ప్రియుడి మర్మాంగాన్ని కోసిన మహిళ


 Also Read : Crime News: తాగిన మైకంలో డెలివరీ బాయ్‌ను ఘోరంగా కొట్టిన యువకులు